Iddari Lokam Okate Review

సినిమా రివ్యూ: ఇద్దరి లోకం ఒకటే
రేటింగ్: 2/5

నటీనటులు: రాజ్ తరుణ్, షాలిని పాండే, రాజా సిరివెన్నెల, నాజర్, భరత్, రోహిణి తదితరులు
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
సంగీతం: మిక్కీ జె. మేయర్
సమర్పణ: దిల్ రాజు
నిర్మాత: శిరీష్
దర్శకత్వం: జీఆర్ కృష్ణ
విడుదల తేదీ: 25 డిసెంబర్ 2019

‘అంధగాడు’, ‘రంగుల రాట్నం’, ‘రాజుగాడు’, ‘లవర్’… రాజ్ తరుణ్ లాస్ట్ సినిమాలు ఏవీ అతడికి హిట్ ఇవ్వలేదు. ఫెయిల్యూర్స్ లో ఉన్న అతడిపై దిల్ రాజు మరోసారి నమ్మకం ఉంచాడు. ‘లవర్’తో హిట్ కొట్టలేకపోయిన రాజ్ తరుణ్, దిల్ రాజు కలిసి ‘ఇద్దరి లోకం ఒకటే’ చేశారు. జీఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉంది?

కథ: హీరోయిన్ కావాలనేది వర్ష (షాలిని పాండే) లైఫ్ యాంబిషన్. ఆడిషన్స్ ఇస్తుంది కానీ అవకాశాలు రావు. ఆల్రెడీ వర్షకు రాహుల్ (రాజా సిరివెన్నెల)తో పెళ్లి నిశ్చయం అవుతుంది. మూడేళ్ళుగా అతడు పెళ్లి చేసుకునే క్షణాల కోసం ఎదురు చూస్తుంటాడు. ఈ సమయంలో వర్షకు ఫేమస్ ఫొటోగ్రాఫర్ మహి (రాజ్ తరుణ్)… ఊటీలో తన తండ్రి తీసిన ఫొటోలతో ఎగ్జిబిషన్ పెడతాడు. అందులో ఒక ఫొటో తను చిన్నతనంలో దిగిన ఫొటో అని వర్ష డౌట్. ఫొటో ఎగ్జిబిషన్‌కి వెళ్లి రాహుల్‌ను కలుస్తుంది. ‘మనం ఇద్దరం చిన్నతనం స్నేహితులం. ఈ ఫొటో మా నాన్న తీసినది’ అని చెబుతాడు. వర్షతో రాహుల్ తీసిన ఒక యాడ్ షూట్ వల్ల వర్షకు హీరోయిన్ ఛాన్స్ వస్తుంది. మళ్లీ ఇద్దరి మధ్య స్నేహం మొదలై.. క్రమంగా ప్రేమ మొదలవుతుంది. ఈ ప్రేమకథ ఏ కంచికి చేరిందనేది సినిమా.

ప్లస్ పాయింట్స్:
షాలిని పాండే యాక్టింగ్
మిక్కీ జె మేయర్ మ్యూజిక్
సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:
దర్శకత్వం
కథ… క్లైమాక్స్
మరీ స్లో నేరేషన్
ఎమోషన్స్ వర్కవుట్ కాలేదు
ప్రేమలో మేజిక్ మిస్ అయింది

విశ్లేషణ:
కథగా చెప్పుకోవాలంటే… ‘ఇద్దరి లోకం ఒకటే’లో క్లైమాక్స్ తప్ప కొత్త పాయింట్ ఏమీ లేదు. ఆ క్లైమాక్స్ కూడా తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుందా? అంటే అనుమానమే. ఈ కథకు అటువంటి ముగింపు ఇవ్వాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. కావాలని క్లైమాక్స్ అలా తీసినట్టు ఫోర్స్డ్ గా ఉంటుంది. కథ విషయానికి వస్తే… గతంలో చాలా తెలుగు సినిమాల్లో ఇంచుమించు ఇదే లైన్ తో వచ్చిన కథలను చూసే ఉంటారు. ఆమాటకొస్తే ప్రతి ప్రేమకథలో ప్రేమే ఉంటుంది. ఆ ప్రేమను ప్రేక్షకుడు ఫీలయ్యేలా దర్శకుడు చూపించగలిగితే సినిమా హిట్ అవుతుంది. లేదంటే బాక్సాఫీస్ దగ్గర కష్టాలు తప్పవు. ఈ ప్రేమ కథలో ప్రేమను ప్రేక్షకుడు ఫీలయ్యేలా దర్శకుడు ఎక్కడా తీయలేదు. ఎమోషన్స్ ఏవీ వర్కవుట్ కాలేదు. ముఖ్యంగా షాలిని పాండే ఎందుకు హీరోయిన్ కావాలనుకోవడానికి గల చూపించిన కారణం టచ్ చేసే విధంగా లేదు. తెరపై సన్నివేశాలు వస్తుంటాయి. వెళుతుంటాయి. కానీ, ప్రేక్షకుడి మనసును హత్తుకునే సన్నివేశాలు చాలా తక్కువ ఉంటాయి. కథలో వినోదం లేకపోవడంతో ప్రతి సన్నివేశం సాగదీసినట్టు ఉంటుంది. ఏదో తెలియని వెలితి ప్రేక్షకుడిని వెంటాడుతుంది. అయితే… అందమైన ప్రేమకథకు కావలసిన సంగీతం, ఛాయాగ్రహణం ఈ సినిమాకు కుదిరాయి. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన మెలోడీలు వినసొంపుగా ఉన్నాయి. పాటలను చిత్రీకరించిన విధానం కూడా బావుంది. సమీర్ రెడ్డి ప్రతి ఫ్రేమును అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. ఊటీ అందాలతో పాటు ఆర్ట్ వర్క్ చూడముచ్చటగా ఉంది.  

నటీనటుల అభినయం:
షాలిని పాండే క్యూట్, బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. లవ్ సీన్స్ లో ముద్దు ముద్దుగా ఉంది. అలాగే, ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదనిపిస్తుంది. షాలిని పాండే యాక్టింగ్ సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకువచ్చింది. రాజ్ తరుణ్ తన సహజశైలికి భిన్నంగా సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. అయితే… రాజ్ తరుణ్, షాలిని పాండే మధ్య కెమిస్ట్రీ అంతగా కుదరలేదు. హీరోయిన్ తల్లిగా రోహిణి క్యారెక్టర్, యాక్టింగ్ రొటీన్ గా అనిపిస్తాయి. నాజర్ పాత్ర అతిథిలా ఉంటుంది.