Brochevarevarura Movie Review

Brochevarevarura Movie Review

సినిమా రివ్యూ: బ్రోచేవారెవరురా 
రేటింగ్: 3/5

నటీనటులు: నివేదా థామస్, శ్రీ‌విష్ణు, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామకృష్ణ, సత్యదేవ్, నివేదా పేతురాజ్, హర్షవర్ధన్ తదితరులు
సినిమాటోగ్రఫీ:సాయి శ్రీరామ్ 
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: విజయ్ కుమార్ మాన్యం
కథ, మాటలు, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ 
విడుదల తేదీ: 28 జూన్  2019

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘మెంటల్ మదిలో’తో వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమయ్యాడు. మళ్లీ శ్రీవిష్ణుతో ‘బ్రోచేవారెవరురా’ తీశాడు. ఇందులో శ్రీవిష్ణు తెరపై కనిపించినంత సేపూ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రలు పోషించారు. నివేదా థామస్ ప్రధాన పాత్ర పోషించింది.  సత్యదేవ్, నివేదా పేతురాజ్ మరో జంటగా నటించారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఎలా ఉంది? ఓసారి చూడండి. 

కథ: 
ఆర్3 బ్యాచ్…  రాహుల్ (శ్రీవిష్ణు), రాంబో (రాహుల్ రామకృష్ణ), రాకీ (ప్రియదర్శి) ఐదేళ్లుగా ఇంటర్ చదువుతూ ఉంటారు. కాలేజ్ ప్రిన్సిపల్ కుమార్తె మిత్ర (నివేదాథామస్) వీళ్ల  క్లాస్ లో జాయిన్ అవుతుంది. ఆ అమ్మాయి, ఆర్3 బ్యాచ్ కలిసి ఏం చేశారు? అందువల్ల, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? ఈ కథతో దర్శకుడు కావాలనుకుంటున్న విశాల్ (సత్యదేవ్), ప్రముఖ హీరోయిన్ షాలిని (నివేదా పేతురాజ్)కి సంబంధం ఏంటి? అనేది కథ. 

ప్లస్ పాయింట్స్:
వినోదం
నటీనటులు
పాటలు 
కథలో మలుపులు 

మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
బలమైన కథ లేకపోవడం
నేపథ్య సంగీతం

విశ్లేషణ:
‘చలనమే చిత్రము… చిత్రమే చలనము’ – ఈ సినిమా కాప్షన్. ఆల్రెడీ సినిమా చూసినవాళ్లకు ఈ కాప్షన్ ఎందుకు పెట్టారో అర్ధమవుతుంది. చూడనివాళ్లు క్యాప్ష‌న్‌ని గుర్తు పెట్టుకోండి… సినిమాలో మాంచి ట్విస్ట్ ఇస్తుంది. కథగా చెప్పుకుంటే పెద్ద కథేం కాదు. కానీ, కామెడీ మాత్రం బావుంది. అదే సినిమాను కాపాడింది. చిన్న కథను కామెడీ ప్లస్ ట్విస్టులతో దర్శకుడు వివేక్ ఆత్రేయ బాగా చెప్పాడు. కథ కంటే క్యారెక్టరైజేషన్లను బాగా రాసుకున్నాడు. సినిమాలో వచ్చే చిన్న క్యారెక్టర్లపై కూడా బాగా దృష్టి పెట్టాడు. ఫస్టాఫ్ అంతా వినోదంతో బండి నడిపించి, కథలో చిక్కుముళ్లు వేసిన దర్శకుడికి… సెకండాఫ్ లో అసలు కథ చెప్పే దగ్గరకు వచ్చేసరికి, చిక్కుముళ్లు ఒక్కొక్కదాన్ని విప్పే సమయం వచ్చేసరికి వినోదాన్ని కాస్త పక్కకు పెట్టక తప్పలేదు. ఎంతసేపూ కిడ్నాప్ చుట్టూ కథ తిరగడంతో కాస్త బోర్ కొడుతుంది. మళ్లీ సేమ్ సీన్లు రిపీట్ అవుతాయా? అనే అనుమానం ప్రేక్షకులకు కలుగుతుంది. అక్కడ చేజింగ్ సీన్లు సాగదీసినట్టు అనిపిస్తాయి. దానికి తోడు నేపథ్య సంగీతం చికాకు పెట్టింది. కానీ, పాటలు మాత్రం బావున్నాయి. నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ సూపర్.

నటీనటుల పనితీరు:
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి… ముగ్గురూ పాత్రలకు తగ్గట్టు నటించారు. ముగ్గురి మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ బాగా వర్కవుట్ అయింది. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ కథకు ప్లస్ అయ్యాయి. కథకు కీలకమైన పాత్రలో నివేదా థామస్ చక్కటి నటనతో ఆకట్టుకుంది. కానీ, ఆమెకు సవాల్ విసిరే పాత్ర కాదిది. సత్యదేవ్, నివేదా పేతురాజ్ పాత్రలు కథలో కీలకం కాకున్నా.. తమ నటనతో ఆ పాత్రలు హుందాతనాన్ని తీసుకొచ్చారు. ఇద్దరి మధ్యలో వచ్చే ‘తలపు తలుపు తెరిచినా స్వయానా’ పాట బావుంది. హర్షవర్ధన్ కనిపించిన కాసేపూ నవ్వించారు. మిగతా పాత్రధారులు తమ పరిధి మేరకు నటించారు.     

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కొత్త కథ కాదు, పెద్ద కథ కూడా కాదు. కానీ, ‘బ్రోచేవారెవరురా’లో కామెడీ ఆకట్టుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు సినిమా నచ్చుతుంది. చిన్న చిన్న డైలాగులు నవ్విస్తాయి. నటీనటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.