రానా, బన్నీల‌కు ఊహించ‌ని గిఫ్ట్‌…


టాలీవుడ్ హీరోలు రానా, అల్లు అర్జున్‌ల‌కు ప్ర‌ముఖ హాస్య న‌టుడు బ్ర‌హ్మ‌నందం కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించారు. క‌లియుగ దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి చిత్రాన్ని త‌న స్వ‌హ‌స్ర్తాల‌తో 45 రోజులు క‌ష్ట‌ప‌డి వేసిన‌ స్కెచ్‌ను అందంగా ఫ్రేమ్ చేయించి వారికి అందించారు. త‌న‌కు పంపించిన ఈ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ప‌ట్ల హీరో అల్లుఅర్జున్ త‌న ట్వీట‌ర్ వేదిక‌గా బ్ర‌హ్మ‌నందం గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. మాకెంతో ఆత్మీయులైన బ్ర‌హ్మానందం గారు మీరు పంపిన బ‌హుమ‌తి వెల‌క‌ట్ట‌లేనిది. ధ‌న్య‌వాదాలు స‌ర్ అని బ‌న్ని ట్వీట్ చేశారు. అదే విధంగా హీరో ద‌గ్గుబాటి రానా కూడా త‌న‌కు పంపిన బ‌హుమ‌తి ప‌ట్ల సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. బ్ర‌హ్మ‌నందం గారు నాకు ఈ అంద‌మైన కానుక‌ను పంపిచారు. ద‌న్య‌వాదాలు. మీకు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు స‌ర్.. ఇలాంటివి మా తాత‌గారు ఎంతో ఇష్ట‌ప‌డేవారు అని రానా పేర్కొన్నారు. బ్ర‌హ్మ‌నందం ఇటీవ‌ల లాక్‌డౌన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇబ్బందుల‌ను పెన్సిల్ స్కెచ్ వేసిన చిత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే.