Majili Movie Review 2.75/5

Majili Movie Review  2.75/5
మజిలీ సినిమా రివ్యూ
సినిమా రివ్యూ: మజిలీ
రేటింగ్: 2.75/5
నటీనటులు: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అతుల్ కులకర్ణి తదితరులు
నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్
పాటలు: భాస్కరభట్ల, వనమాలి, చైతన్య ప్రసాద్, గోసల రాంబాబు
ఎడిటర్: ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ: విష్ణు శర్మ
స్వరాలు: గోపిసుందర్
నేపథ్య సంగీతం: ఎస్.ఎస్. తమన్
నిర్మాత‌లు: సాహు గారపాటి, హరీష్ పెద్ది
కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ
విడుదల తేదీ: ఏప్రిల్ 05, 2018
అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’. ప్రేమకథా చిత్రాల్లో ఓ మధురమైన చిత్రంగా నిలిచింది. వీరిద్దరూ తరవాత ‘మనం’ చేశారు. క్లాసిక్‌గా నిలిచింది. ఏయన్నార్ నటించిన చివరి చిత్రం కావడంతో… అక్కినేని అభిమానులు, ముఖ్యంగా కుటుండ స‌భ్య‌లు ఎప్ప‌టికీ మ‌రువ‌లేని చిత్రంగా చ‌రిత్ర‌కు ఎక్కింది. యాక్షన్ కథతో తెరకెక్కిన ‘ఆటో నగర్ సూర్య’ను పక్కన పెడితే… పెళ్లి తరవాత ప్రేమకథగా ‘మజిలీ’తో ప్రేక్షకుల ముందుకొచ్చారు నాగచైతన్య, సమంత దంపతులు. ‘నిన్ను కోరి’తో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ తీసిన రెండో చిత్రమిది. పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ చూడండి.
కథ: పూర్ణ (నాగచైతన్య) పాలిటెక్నిక్‌ చదువుతుంటాడు. అతడి తండ్రి ఓ రైల్వే టిటి (రావు రమేష్). మంచి క్రికెటర్ అయ్యి, దేశం తరపున క్రికెట్ ఆడాలనేది అతడి కల. ఆ సమయంలో పూర్ణకు ఓ నేవీ అధికారి కుమార్తె అన్షు (దివ్యాన్ష కౌశిక్) పరిచయమవుతుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఓ చోటా రాజాకీయ నాయకుడు అన్షుపై మోజు పడతాడు. అతడిని పూర్ణ కొట్టడంతో, అన్షు వాళ్ళింటికి వెళ్లిన రాజకీయ నాయకుడు ఇద్దరి ప్రేమ గురించి చెబుతాడు. అన్షు కుటుంబం అమ్మాయిని తీసుకుని, విశాఖ నుంచి వేరే ఊరు వెళ్ళిపోతుంది. ప్రేయసి దూరమైన బాధలో సిగరెట్, ముందుకు బానిస అవుతాడు. క్రికెట్‌కి దూరం అవుతాడు. ఇవన్నీ తెలిసి ఎదురింటి అమ్మాయి శ్రావణి (సమంత) అతణ్ణి పెళ్లి చేసుకుంటుంది. గతం మరువలేక, భార్యను దగ్గరకు రానివ్వలేక అందర్నీ బాధ పెడుతుంటాడు పూర్ణ. చివరికి, అతను గతం ఎలా మరిచాడు? భార్యకు ఎలా దగ్గర అయ్యాడు? అనేది చిత్రకథ.
ప్లస్‌ పాయింట్స్‌:
నాగచైతన్య, సమంత నటన
ఎమోషనల్ సీన్స్
మైనస్‌ పాయింట్స్‌:
ఫ‌స్టాఫ్‌లో ప్రేమ‌క‌థ‌
నిదానంగా సాగే సన్నివేశాలు
ఊహించదగ్గ మలుపులు, కథ
విశ్లేషణ:
‘పెళ్లి తరవాత ప్రేమ బాధ్యతలో ఉంటుంది. అది కంటికి కనిపించదు’… ఈ లైన్ దర్శకుడు శివ నిర్వాణ చెప్పాలనుకున్న కథకు మూలం. దీన్ని పతాక సన్నివేశానికి మాత్రమే పరిమితం చేశాడు. ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ… భర్త అనురాగానికి, ఆప్యాయతకు నోచుకోని ఓ భార్య కథను, ఆమె బాధను తెరపై ఎక్కువసేపు చూపించాడు. అదీ సెకండాఫ్‌లో. భార్యను బాధపెడుతూ భర్త ఏమన్నా సుఖంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ‘ల‌వ్ లెట‌ర్‌లో రాసుకున్న‌ అమ్మాయి పేరు, వెడ్డింగ్ కార్డులో లేదు’ అని గతాన్ని తలచుకుంటూ వర్తమానంలో తను బాధ పడుతూ… భార్యను, తండ్రిని, అత్తమామలను బాధ పెడుతూ ఉంటాడు.
హీరో హీరోయిన్ల బాధలను, బాధ్యతలను తెరపై తీసుకోవడంలో శివ నిర్వాణ చాలావరకూ విజయవంతం అయ్యాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా తీశాడు. కానీ, సినిమాను సాగదీశాడు. డైలాగుల్లో తన ప్రతిభ చూపించాడు. సందర్భానుసారంగా వినోదం పండించాడు. ఫ‌స్టాఫ్‌లో ప్రేమ‌క‌థ‌ ఆకట్టుకునేలా లేదు. అందువల్ల, పూర్ణ బాధను ప్రేక్షకులు ఫీలయ్యే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా ట్విస్ట్ విషయంలో సరైన క్లారిటీ లేదు. పతాక సన్నివేశాలను సాగదీశాడు. గోపిసుందర్ పాటల్లో ‘ప్రియతమా… ప్రియతమా’ బావుంది. మిగతావి సోసోగా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం పర్లేదు. ఫైట్స్ ఓకే. నిర్మాణ విలువలు బావున్నాయి.
నటీనటులు పనితీరు:
నాగచైతన్య, సమంత ఇద్దరూ పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారు. అలాగని, కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాలో ఇచ్చారని చెప్పలేం. మిడిల్ క్లాస్ భార్యలా సమంత డ్రస్సింగ్ బావుంది. డబ్బింగ్ చెప్పుకోవడంలో సమంత మరింత మెరుగవ్వాలి. 19 ఏళ్ల కుర్రాడిలా, 30లలో ఉన్న వ్యక్తిగా లుక్ పరంగా వైవిధ్యం చూపించాడు. దివ్యాన్ష కౌశిక్ కొన్ని సన్నివేశాల్లో అందంగా కనిపించింది. మరికొన్ని సన్నివేశాల్లో చైతూ కంటే వయసు ఎక్కువ ఉన్న అమ్మాయిలా ఉంది. రావు రమేష్, పోసాని, అతుల్ కులకర్ణి, సందీప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
ఫైన‌ల్ గా …
సినిమాలో ట్విస్ట్ రివీల్ చేయకుండా చెప్పాలంటే… ‘కూతురు దిద్దిన కాపురం’ ఈ ‘మజిలీ’. పూర్ణ పాత్రలో చైతన్య, శ్రావణిగా సమంత చక్కగా నటించారు. సినిమాలో ఎమోషనల్ మూమెంట్స్ కొన్ని ఉన్నాయి.