సూర్యకాంతం సినిమా రివ్యూ

సూర్యకాంతం సినిమా రివ్యూ
సూర్యకాంతం సినిమా రివ్యూ
సినిమా రివ్యూ: సూర్యకాంతం
రేటింగ్: 1.75/5
నటీనటులు: నిహారికా కొణిదెల, రాహుల్ విజయ్, పెర్లిన్ బేసానియా, ‘స్వామి రారా’, సత్య, శివాజీ రాజా తదితరులు
నిర్మాణ సంస్థ: నిర్వాణ సినిమాస్
పాటలు: కెకె (కృష్ణకాంత్)
ఎడిటర్: రవితేజ గిరజాల
సినిమాటోగ్రఫీ: హరి జాస్తి
సంగీతం: మార్క్ కె. రాబిన్
సమర్పణ: వరుణ్ తేజ్
నిర్మాత‌లు: సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్
కథ, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి
విడుదల తేదీ: మార్చి 29, 2018
మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి తరవాత హీరోలుగా వచ్చినవారి సంఖ్య పది వరకూ ఉంది. కానీ, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ మాత్రం ఒక్కరే… నిహారికా కొణిదెల. ఫ్యామిలీ ఇమేజ్, అభిమానుల ఒత్తిడి వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని కథలు ఎంపిక చేసుకుంటోంది. ఇప్పటికి రెండు సినిమాలు ‘ఒక మనసు’, ‘హ్యాపీ వెడ్డింగ్’ చేసింది. రెండూ కమర్షియల్ సక్సెస్ ఇవ్వలేదు. మూడో సినిమా ‘సూర్యకాంతం’ ఈ రోజు విడుదలైంది. ఈ సినిమా అయినా కమర్షియల్ సక్సెస్ ఇస్తుందా? లేదా? రివ్యూ చదివి తెలుసుకోండి.
క‌థ‌లోకి వెళితే..
 సూర్యకాంతం (నిహారికా కొణిదెల) చిన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు (సమీర్, సుహాసిని) గొడవలు పడీ పడీ చివరకు విడాకులు తీసుకుంటారు. అప్పట్నుంచి తల్లి దగ్గర పెరుగుతుంది. పేరెంట్స్ ప్రభావంతో ప్రేమ, పెళ్లికి దూరంగా ఉంటుంది. ఉన్నట్టుండి ఇంట్లో అమ్మకు చెప్పకుండా ఎక్కడికో టూర్‌కి వెళ్లి, తనకు నచ్చినన్ని రోజులు ఉండి వస్తుంది. అటువంటి అమ్మాయిని అభి (రాహుల్ విజయ్) ఇష్టపడతాడు. ప్రేమిస్తాడు. సూర్యకాంతం తల్లి మరణించిన తరవాత ఆమెకు ఇంటికి తీసుకువెళ్లి ప్రేమగా చూసుకుంటాడు. అయితే… ఒకరోజు అభికి చెప్పకుండా సూర్యకాంతం ఎక్కడికో వెళ్లిపోతుంది. రోజులు… వారాలు… నెలలు ఎదురు చూసినప్పటికీ రాదు. మొదట్లో బాధపడిన అభి, ఏడాది తరవాత సాధారణ స్థితికి వస్తాడు. ఇంట్లో తల్లిదండ్రులు చూసిన అమ్మాయి పూజ (పెర్లిన్ బేసానియా)ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. నిశ్చితార్థానికి రెండు రోజులు ఉందనగా… సూర్యకాంతం మళ్లీ తిరిగొస్తుంది. అప్పుడు అభి ఏం చేశాడు? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అభి సిద్ధమయ్యాడని తెలిసిన తరవాత సూర్యకాంతం ఏం చేసింది? వీరిద్దరి గతం తెలిసిన పూజ ఏమంది? అభి చివరికి ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు? పాత ప్రేమను మర్చిపోయాడా? కొత్తగా జీవితంలోకి వచ్చిన అమ్మాయిని వదిలేశాడు? అనేది చిత్రకథ.
ప్లస్‌ పాయింట్స్‌:
నిహారిక క్యారెక్ట‌రైజేష‌న్‌
రెండు పాటలు
మైనస్‌ పాయింట్స్‌:
కథ, దర్శకత్వం
విసుగు తెప్చించే  కామెడీ
విశ్లేషణ:
‘అవసరమైనప్పుడు వదిలేయడం కూడా ప్రేమే’… పతాక సన్నివేశాల్లో నిహారిక చెప్పే డైలాగ్. బహుశా… కథకు మూలం ఈ డైలాగే అయ్యి ఉండొచ్చు. క్లైమాక్స్‌లో ప్రేక్షకులు కొత్తగా భావిస్తారని దర్శకుడు భావించి ఉండొచ్చు. కానీ, కథేం కొత్తది కాదు. నాగార్జున హీరోగా నటించిన ‘ఆవిడా మా ఆవిడే’, ‘మోహన్ బాబు ‘అల్లరి మొగుడు’ సినిమాల నుంచి స్ఫూర్తి పొందినది. కాకపోతే చిన్న డిఫరెన్స్ ఉంది. ‘ఆవిడా.. మా ఆవిడే’లో నాగార్జునకు పెళ్లి అవుతుంది. ఓ ప్రమాదంలో భార్య చనిపోయిందనుకుని బాధలో ఉంటాడు. కొన్నాళ్ల తరవాత ఇంట్లో పెద్దలు చూసిన సంబంధం చేసుకుంటాడు. ‘అల్లరి మొగుడు’లోనూ అంతే. ‘సూర్యకాంతం’లో మాత్రం ప్రేమించిన అమ్మాయి దూరమైన తరవాత హీరో మరో అమ్మాయితో పెళ్ళికి సిద్ధమైనట్టు చూపించారు. రొటీన్ క్లైమాక్స్ కాకుండా ట్విస్ట్ ఇచ్చారు. ఈ సినిమాలో కొత్తదనం ఏమైనా ఉందంటే… నిహారికా కొణిదెల క్యారెక్ట‌రైజేష‌న్‌. క్షణానికి ఒకలా ప్రవర్తించే అమ్మాయిలా ఫ‌స్టాఫ్‌లో చూపించారు. క్యారెక్ట‌రైజేష‌న్ బావున్నా.. అందుకు తగ్గట్టు సన్నివేశాలు రాసుకోవడంలో దర్శకుడు ప్రణీత్ బ్రహ్మాండపల్లి విలమయ్యాడు. ‘జోక్ పేలలేదు’ అని సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. నిజంగా, సినిమాలో చాలా జోకులు పేలలేదు. హడావిడిగా… ఎవరో తరుముకొస్తున్నట్టుగా సన్నివేశాలు తీసి మమ అనిపించుకున్నారు. కాంటెంప‌ర‌రీ డ్ర‌స్సింగ్‌లో నిహారిక కొన్ని సన్నివేశాల్లో బావుంది. కొన్ని సన్నివేశాల్లో ‘ఇవేం బట్టలు’ అనిపించింది. మార్క్ రాబిన్ స్వరాల్లో సిద్ శ్రీరామ్ పాడిన ‘ఇంతేనా ఇంతేనా’ బావుంది. అబ్బాయిలను ఉద్దేశిస్తూ హీరోయిన్ పాడుకున్న బ్రేకప్ సాంగ్ ‘బిస్కెట్ అయ్యేరో’ కూడా. నిర్మాత విలువలు పర్వాలేదు.
నటీనటులు పనితీరు:
నిహారికా కొణిదెల క్యారెక్ట‌రైజేష‌న్‌కు తగ్గట్టు కొన్ని సన్నివేశాల్లో బాగా నటించింది. ఎన‌ర్జిటిక్‌గా కనిపించింది. క్లైమాక్స్‌లో ఎమోష‌న‌ల్ సీన్స్‌లో ప‌ర్వాలేద‌నిపించేలా చేసింది. యాక్టింగ్ పరంగా రాహుల్ విజయ్‌కి పెద్ద స్కోప్ లేదు. క‌న్ఫూజ‌న్ ఫేస్ పెట్ట‌డం త‌ప్ప‌! పెర్లిన్ బేసానియా పర్వాలేదు. మిగతావాళ్ళు అతి చేశారు. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి బావుంది.
సూటిగా చెప్పాలంటే:
‘వెబ్ సిరీస్‌కి ఎక్కువ‌… సినిమాకు త‌క్కువ‌’ అన్నట్టుంది ‘సూర్యకాంతం’ పరిస్థితి. రెబ‌ల్‌గా ఉండే మోడ్రన్ అమ్మాయి క్యారెక్ట‌రైజేష‌న్‌ కాసేపు ఎంజాయ్ చేయాలనుకుంటే సినిమాకు వెళ్లొచ్చు. లేకపోతే విసుగు తెప్పించే కామెడీని భరించడం కష్టం. నిహారిక, ప్రణీత్ కాంబినేషన్లో ‘ముద్దపప్పు ఆవకాయ్’ అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది. దాన్ని చూడటం బెటర్.