Palasa 1978 Movie Review

Palasa 1978 Movie Review
సినిమా రివ్యూ: పలాస 1978
రేటింగ్‌: 2.75/5
 
నటీనటులు: రక్షిత్, రఘు కుంచె, తిరువీర్, నక్షత్ర, లక్ష్మణ్ తదితరులు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు 
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్
సంగీతం: రఘు కుంచె
సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ
నిర్మాత: ధ్యాన్ అట్లూరి 
కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: కరుణ కుమార్ 
విడుదల తేదీ: 06 మార్చి 2020
 
సుకుమార్ నుండి మారుతి వరకు విడుదలకు ముందు పలువురు దర్శకులు, చలనచిత్ర ప్రముఖుల ప్రశంసలు అందుకున్న చిత్రం ‘పలాస1978’. ‘అసురన్’ తరహా చిత్రమని నటీనటులు, దర్శక-నిర్మాతలు ప్రచారం చేశారు. మరి, సినిమా ఎలా ఉంది? రివ్యూ చదివి తెలుసుకోండి.
 
కథ: పలాసలో ఒక జాతరలో ఎన్నికల బరిలో ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్న వ్యక్తి తలను ఎవరో నరికేస్తారు. ఒక్క వేటుకు తల నరికినది మోహనరావు (రక్షిత్)వే అని అందరూ అనుమానిస్తారు. ఎప్పుడో పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడని ప్రచారం జరిగిన అతడు బతికే ఉన్నాడా? పలాసలోని బడుగు బలహీన వర్గాల కాలనీ అంబుసోలీకి చెందిన పాటగాడు, జానపద కళాకారుడు మోహనరావు, అతడి అన్న రంగారావు (తిరువీర్) రౌడీలుగా ఎలా మారారు? వీళ్లను రౌడీలుగా మార్చిన పెద్ద షావుకారు (జనార్ధన్), చిన్న షావుకారు (రఘు కుంచె) వీళ్ల జీవితాలతో ఎలా ఆడుకున్నారు? బడుగు వర్గాలను అగ్ర వర్ణాలకు చెందిన వారు ఎన్ని అవమానాలకు గురి చేశారు? చివరకు ఏమైంది? అనేది వెండితెరపై చూడాలి. 
 
ప్లస్‌ పాయింట్స్‌:
పలాస నేపథ్యం, శ్రీకాకుళం యాస
కరుణకుమార్ రాసిన సంభాషణలు
రఘు కుంచె నేపథ్య సంగీతం, స్వరాలు
నటీనటుల అభినయం
 
మైనస్‌ పాయింట్స్‌:
కొత్త కథేం కాదు
పతాక సన్నివేశాలు
మరీ నిదానంగా సాగిన సినిమా
‘రంగస్థలం’,’అసురన్’ చిత్రాలు గుర్తుకు రావడం 
 
విశ్లేషణ: ‘పలాస’లో అద్భుతమైన కథేమీ లేదు. అదేమీ కొత్త కథ కూడా కాదు. కానీ, కథను నడిపించిన తీరు అద్భుతంగా ఉంది. ‘రంగస్థలం’లో ఇంచుమించు ఇటువంటి కథను తెలుగు ప్రేక్షకులు చూశారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయంగా ఎదగకుండా అగ్ర వర్ణాలు ఎలా అణగదొక్కాయి? అవసరాలకు ఎలా వాడుకున్నాయి? అనేది క్లుప్తంగా కథ. పలాస నేపథ్యం, శ్రీకాకుళం యాస సినిమాకు కొత్త సొగసు అద్దింది. దీనికి అత్యంత సహజంగా చిత్రాన్ని తెరకెక్కించిన తీరు, లోతైన భావాలున్న మాటలు తోడు అవడంతో సినిమా ఆసక్తికరం ఉంది. ‘బలం ఉన్నవాడికి కులం అవసరం లేదు’ వంటి మాటలు సమాజ పరిస్థితులకు అద్దం పట్టాయి. ‘వినాయకుడి తలను అతికించి ప్రాణం పోయడానికి వచ్చిన దేవుళ్లు, ఏకలవ్యుడు వేలు ఎందుకు అతికించలేదు?’ వంటి ప్రశ్నలు ప్రేక్షకులలో ఆలోచన రేకెత్తిస్తాయి. రా అండ్ రియలిస్టిక్ సినిమా ‘పలాస’. ప్రథమార్థంలో దర్శకుడు నిజాయతీగా కథను నడిపించాడు. సుమారు 40 ఏళ్ల క్రితం పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించారు. ద్వితీయార్థంలో ఒక్క శాతం బడుగు వర్గాలవైపు మొగ్గు చూపినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలను మరీ నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్లాడు. కథను, దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన తీరును, చిత్రాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది మాత్రం రఘు కుంచె నేపథ్య సంగీతమే.కథను దాటి ఎక్కడా బయటకు వెళ్లకుండా స్వరాలు, నేపథ్య సంగీతం అందించాడు. పాటల్లో పల్లెటూరి జానపద సొగసు వినిపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండి ఉంటే బావుండేది. యాక్షన్ దృశ్యాలూ సజహంగా ఉన్నాయి. అప్పట్లో వాడుక భాషను తెరపై చూపించే క్రమంలో కొన్ని సన్నివేశాల్లో బూతు పదాలు దొర్లాయి.
 
నటీనటుల పనితీరు: కథానాయకుడిగా, నటుడిగా రక్షిత్ రెండో చిత్రమిది. రెండో చిత్రానికి బరువైన భావోద్వేగాలు ఉన్న పాత్రను ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. పాత్రను చెడగొట్టకుండా తన శక్తి మేరకు న్యాయం చేశాడు. చిన్న షావుకారుగా రఘు కుంచె ఒదిగిపోయాడు. పాత్రకు తగ్గట్టు నటనలో, ఆహార్యంలో వైవిధ్యం చూపించాడు. పెద్ద షావుకారుగా జనార్ధన్ కూడా బాగా చేశాడు. తిరువీర్, నక్షత్ర్ర, మిగతా నటీనటుల నటనలో సహజత్వం కనిపించింది. 
 
final  ‘పలాస’ కొత్త కథ కాకపోయినా… తెలుగు తెరపై కొత్త ప్రాంతాన్ని ఆవిష్కరించింది. కొత్త యాసకు ప్రాధాన్యం ఇచ్చింది. ఆ యాస, పాటలు, నేపథ్య సంగీతం మిగతా సినిమాల మధ్య ఈ సినిమాను భిన్నంగా నిలబెట్టాయి. తమిళ దర్శకులు పా. రంజిత్, వెట్రిమారన్ చిత్రాల తరహాలో సహజంగా తెరకెక్కించిన చిత్రమిది. దళిత భావజాలానికి, దళితులకు అండగా నిలిచిన చిత్రమిది. దళితులు ఎదుర్కొన్న అవమానాలను ప్రపంచానికి తెలియజేసే చిత్రమిది. మనిషిని మనిషిగా చూడాలని సందేశం ఇచ్చే చిత్రమిది.