Mallesham Movie Review2.25/5

Mallesham Movie Review2.25/5
 
సినిమా రివ్యూ: మల్లేశం 
రేటింగ్: 2.25/5
 
నటీనటులు: ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి, గంగవ్వ, తాగుబోతు రమేష్ తదితరులు
పాటలు: దాశరథి, గోరెటి వెంకన్న, చంద్రబోస్  
మాటలు: పెద్దింటి అశోక్ కుమార్ 
సినిమాటోగ్రఫీ: బాలు శాండిల్య 
సంగీతం: మార్క్ కె. రాబిన్ 
నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి 
రచన, దర్శకత్వం: రాజ్ ఆర్
విడుదల తేదీ: 21 జూన్  2019
 
పద్మశ్రీ పురస్కారమైనా… మరొకటైనా…. ప్రముఖులకు వస్తేనే ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. అసాధారణ ఘనత సాధించిన సామాన్యులకు వస్తే రెండు రోజులు వార్తల్లో ఉంటారు తప్ప..‌. తర్వాత మెజారిటీ ప్రజలకు గుర్తు ఉండరు. అటువంటి వ్యక్తే చింతకింది మల్లేశం… ‌చేనేత కార్మికుల వెతలు తీర్చిన ఆసు యంత్రం సృష్టికర్త. ఆయన జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ బయోపిక్ ఎలా ఉంది?
 
కథ: 
నల్గొండ జిల్లాలోని చిన్న గ్రామం రేవన్ పల్లెలో చేనేత కుటుంబంలో జన్మించిన వ్యక్తి చింతకింది మల్లేశం (ప్రియదర్శి). కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆరో తరగతిలో బలవంతంగా చదువు మానేయాల్సి వస్తుంది. అప్పటి నుంచి ఇంట్లో మగ్గం పనిచేస్తుంటాడు. చిన్నతనం నుంచి ఆసు పోయడానికి తల్లి లక్ష్మి (ఝాన్సీ) పడుతున్న కష్టం చూసి, చెల్లించి ఆశ యంత్రాన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. భార్య పద్మ (అనన్య) తప్ప… మిగతా వారందరూ నిరుత్సాహపరిచినా, అడుగడుగునా అవమానాలు ఎదురైనా, ఆర్థిక కష్టాలు వెంటాడినా… పట్టువదలని విక్రమార్కుడిలా చింతకింది మల్లేశం ఏడేళ్లు శ్రమించి ఆశ యంత్రాన్ని ఎలా కనుగొన్నాడు అనేది చిత్రకథ.
 
ప్లస్ పాయింట్స్:
మాటలు, పాటలు
తెలంగాణ సంస్కృతి
తాగుబోతు రమేష్ పాత్ర 
 
మైనస్ పాయింట్స్:
స్లో నేరేషన్
దర్శకత్వం
ఎమోషన్స్ ఎక్కడ?
 
విశ్లేషణ:
ప్రేక్షకులకు తెలిసిన కథను తెరమీదకు తీసుకురావడం కత్తి మీద సాము. కథ తెలుసు కనుక ప్రతి సన్నివేశంలో భావోద్వేగం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉండాలి. లేదంటే రెండున్నర గంటలు థియేటర్లలో కూర్చోవడం కష్టమే. ‘మల్లేశం’ చూడడానికి అటువంటి కష్టాన్ని అక్కడక్కడ పడాల్సి ఉంటుంది. చింతకింది మల్లేశం ఎక్కువమందికి గుర్తు ఉండకపోవచ్చు కానీ… ఆయన జీవిత ప్రయాణం గుర్తే. పాఠశాల, కళాశాలకు వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవని వ్యక్తి ఆసు యంత్రాన్ని తయారు చేయడం చాలా గొప్ప. ఇదే ‘మల్లేశం’ చిత్రానికి మూలకథ.
 
ఈ చిత్రకథకు మూలం? ఆసు పోయడానికి తల్లి పడే కష్టాన్ని చూసి చలించిన ఓ కుమారుడు సంకల్పం! ఆ సంకల్పాన్ని సినిమాగా మలిచే క్రమంలో దర్శక, నిర్మాత రాజ్ ఆర్ తెలంగాణ సంస్కృతిని వీలైనంత వాస్తవంగా తెరపై చూపించడంలో సఫలీకృతం అయ్యాడు. మాటల్లో, పాటల్లో తెలంగాణ మట్టివాసన కనిపించింది‌. గోరెటి వెంకన్న రాసిన పాటలు మళ్ళీ మళ్ళీ వినేలా ఉన్నాయి. తెలంగాణ సంస్కృతిని అందంగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. ఉదాహరణకు… పీర్ల పండగ సన్నివేశాలు‌, సినిమా ప్రారంభంలో వచ్చే కథానాయకుడి చిన్ననాటి సన్నివేశాలు. కానీ, కథకు మూలమైన తల్లి కొడుకుల అనుబంధాన్ని ఆవిష్కరించడంలో అంతగా సఫలీకృతం కాలేదు. ఏదో పైపైన చెబుతూ వెళ్ళిన భావన కలుగుతుంది. 
 
ప్రథమార్ధంలో తల్లి కొడుకుల మధ్య భావోద్వేగాలను, ద్వితీయార్థంలో భార్యభర్తల మధ్య భావోద్వేగాలను, ముఖ్యంగా కథానాయకుడి తపనను సమర్థవంతంగా తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు విఫలమయ్యాడు. తెలంగాణ వాస్తవికతను ఆవిష్కరించినంతగా భావోద్వేగాలను ఆవిష్కరించలేదు. ఆసు యంత్రం తయారీకి చేసిన అప్పులు, హైదరాబాద్ లో మల్లేశం పడిన కష్టాల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కథ నుంచి కాస్త బయటకు వెళ్లినట్టు అనిపించినా… ద్వితీయార్థంలో తాగుబోతు రమేష్ పాత్ర ప్రేక్షకుల్ని నవ్విస్తుంది. కాసేపు హుషారు తీసుకొస్తుంది. సినిమా అంతా సుదీర్ఘంగా సాగిన సన్నివేశాలు ఇబ్బంది పెట్టాయి. సంగీతం సినిమాకు బలంగా నిలిచింది.
 
నటీనటుల పనితీరు:
మల్లేశం పాత్రలో ప్రియదర్శి ఆకట్టుకున్నాడు. కామెడీ పాత్రలతో ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్న అతను, ఈ సినిమాతో కంటతడి పెట్టించే పాత్రలను చేయగలనని నిరూపించుకుంటాడు. మల్లేశం భార్యగా నటించిన అనన్య, పలు సన్నివేశాల్లో ప్రియదర్శిని డామినేట్ చేసింది. సహజ నటనతో ఆకట్టుకుంది. మల్లేశం తల్లి లక్ష్మి పాత్రలో ఝాన్సీ ఆకట్టుకుంటారు. తండ్రి పాత్రలో నటించిన వ్యక్తి ఓవర్ యాక్షన్ చేశారు. మల్లేశం స్నేహితులుగా నటించిన ఇద్దరి టైమింగ్ బాగుంది. తాగుబోతు రమేష్ సినిమాలో స‌ర్‌ప్రైజ్ ప్యాకేజ్‌. గంగవ్వ పాత్ర ప్రేక్షకులకు గుర్తుంటుంది.    
 
తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
తెలంగాణలో నల్గొండ సంస్కృతిని చక్కగా ఆవిష్కరించిన చిత్రమిది. మాటల్లో, పాటల్లో తెలంగాణ యాస ఎంత అందంగా ఉంటుందో చూపించిన చిత్రమిది. అయితే… దర్శకుడి అనుభవలేమి వల్ల కళాత్మక చిత్రానికి, కమర్షియల్ సినిమాకు మధ్యలో కొట్టుమిట్టాడింది.