Ismart shankar movie review 2.5/5

Ismart shankar movie review 2.5/5

Ismart shankar movie review 2.5/5

సినిమా రివ్యూ: ఇస్మార్ట్ శంకర్
రేటింగ్: 2.5/5

నటీనటులు: రామ్, నభా నటేష్, నిధి అగర్వాల్, సత్యదేవ్, షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను
పాటలు: భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
సంగీతం: మణిశర్మ
నిర్మాతలు: పూరి జగన్నాథ్, ఛార్మి
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: పూరి జగన్నాథ్
విడుదల తేదీ: 18 జూలై 2019

‘టెంపర్’ తర్వాత పూరి జగన్నాథ్‌కి హిట్ లేదు (స్వయంగా పూరి నోట వచ్చిన మాట). అటు ‘నేను శైలజ’ తర్వాత రామ్ ఖాతాలో సరైన హిట్ పడలేదు. వీరిద్దరూ కలిసి హిట్ కోసం చేసిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’. ఎలా ఉంది? రివ్యూ చదవండి.

కథ: హైద‌రాబాద్‌లో ఓ రౌడీ షీటర్ శంకర్ (రామ్). లైఫ్ సెటిల్ అవుతుందంటే రాజకీయ నాయకుడు కాశీ (పునీత్ ఇస్సార్)ను చంపేస్తాడు. పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తారు. జైలు నుంచి తప్పించుకున్న శంకర్ మెదడులో సబిఐ ఆఫీసర్ అరుణ్ (సత్యదేవ్) జ్ఞాపకాలను ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ట్రాన్స్‌ప్లాంట్‌ తర్వాత శంక‌ర్‌కు తన ప్రేయసి (నభా నటేష్) బదులు సైంటిస్ట్‌ సారా (నిధి అగర్వాల్) ఎందుకు గుర్తుకు వస్తుంది? అసలు, కాశీ మరణానికి కారణం ఎవరు? అనేవి తెలియాలంటే సినిమా చూడాలి.

ప్లస్ పాయింట్స్:
రామ్ డ్యాన్సులు, ఎనర్జీ
నభా, నిధి స్కిన్ షో
మణిశర్మ స్వరాలు, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:
పూరి దర్శకత్వం
రొటీన్ సీన్స్
రామ్ తెలంగాణ యాస

విశ్లేషణ: హాలీవుడ్ ‘క్రిమినల్’ స్ఫూర్తితో బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ కాన్సెప్ట్ తీసుకుని పూరి జగణనాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ కథ రాశారు. తను రాసే ప్రతి కథకు, తన ప్రతి చిత్రానికి స్ఫూర్తి హాలీవుడ్ చిత్రాలేనని ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూరి చెప్పారు. అందువల్ల, హాలీవుడ్ సినిమాకు కాపీనా? కాదా? అనేది పక్కన పెట్టి, ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలా ఉన్నాడని చూస్తే… కాస్త కూడా కొత్తగా లేడు. ఇదొక రొటీన్ కమర్షియల్ పూరి మార్క్ సినిమా. రామ్ క్యారెక్ట‌రైజేష‌న్‌లో పూరి గత సినిమాల్లో హీరో క్యారెక్ట‌రైజేష‌న్లు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే… డైలాగుల్లో డోసు పెరిగింది. ఫైట్స్, సీన్స్ రొటీన్‌గా… పూరి గ‌త సినిమాల్లో ఉన్న‌ట్టున్నాయి. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంట్ కాన్సెప్ట్ కంటే ఇద్దరు భామలు నిధి, నభా స్కిన్ షోపై పూరి ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రతి సన్నివేశంలోనూ హీరోయిన్లు అందాలు దాచుకోవడం కంటే అందరికీ చూపించడంపై ఆసక్తి చూపించారు. వాళ్ల నటన కంటే అందాలే అందరినీ ఆకర్షిస్తాయి. ఇక, రామ్ తెలంగాణ యాస అయితే వినడానికి కష్టంగా ఉంది. అదే అసలైన తెలంగాణ యాస, పోనీ హైదరాబాదీ యాస అనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. దర్శకుడిగా పూరి వైఫల్యాన్ని కప్పి పుచ్చడానికి మణిశర్మ మ్యాగ్జిమ‌మ్‌ ప్రయత్నించాడు. క‌మ‌ర్షియ‌ల్‌ సినిమాకు తగ్గట్టు మాసీ పాటలు ఇచ్చాడు. మెలోడీ సాంగ్ ‘ఉండిపో’ కూడా బావుంది. నేపథ్య సంగీతంతో హీరోని, సినిమాను ఎలివేట్ చేయ‌డానికి ప్రయత్నించాడు. పాటల పిక్చ‌రైజేష‌న్‌ బావుంది.

నటీనటుల పనితీరు:
రామ్ ఇటువంటి మాస్ క్యారెక్టర్ చేసి చాలా రోజులైంది. హుషారుగా చేశాడు. తెలంగాణ యాస ఒక్కటే బాగోలేదు. పాటల్లో మాస్ స్టెప్పులు ఇరగదీశాడు. ఓ వర్గం ప్రేక్షకులు హీరోయిన్లు అందాలు చూడటం కోసం మరోసారి వెళితే తప్పు లేదు. అంతలా చూపించారు మరి. షాయాజీ షిండే, ఆశిష్ విద్యార్ధి తదితరుల నటన, పాత్రలు రొటీనే. సత్యదేవ్ తన పాత్ర వరకూ బాగా చేశాడు.

తెలుగుఒన్ ప్రోస్పెక్టివ్:
కథ ఏదైనా.. కాన్సెప్ట్ ఏదైనా… పూరి జగన్నాథ్ రాత, తీత ఇలాగే ఉంటుందని, మారదని ‘ఇస్మార్ట్ శంకర్’ చూసి అనుకోవాలేమో! సినిమాలో హీరో మారాడు గానీ… పూరి టేకింగ్, హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ మారలేదు. మళ్లీ మళ్లీ అవే సన్నివేశాలు చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు సినిమాకు వెళ్లొచ్చు. లేదంటే ఈజీగా స్కిప్ చేయొచ్చు. ఇదొక మార్క్ రొటీన్ కమర్షియల్ సినిమా. పూరి జగన్నాథ్ వీరాభిమానులు, అరివీర భయంకర మాస్ ప్రేక్షకులకు మాత్రమే. Ismart