Gang Leader Review

Gang Leader Review

‘గ్యాంగ్ లీడర్’ మూవీ రివ్యూ;

రేటింగ్:3/5

నటీనటులు:

నాని, కార్తికేయ, లక్ష్మి, శరణ్య, ప్రియాంక అరుల్ మోహన్, బేబీ ప్రన్యా, వెన్నెల కిషోర్, అనీష్ కురువిల్లా తదితరులు 

పాటలు: అనంత శ్రీరామ్
మాటలు: వెంకీ  
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్‌
సంగీతం: అనిరుధ్‌ రవిచంద్రన్  
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి 
కథ, దర్శకత్వం: విక్రమ్ కె. కుమార్
విడుదల తేదీ: 13 సెప్టెంబర్ 2019

నేచురల్ స్టార్ నాని… ‘ఇష్క్’, ‘మనం’, ’24’ వంటి సినిమాలు తీసిన దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. ఎటువంటి సినిమా చేస్తారోనని! ఆసక్తికి తగ్గట్టు ‘గ్యాంగ్ లీడర్’ అంటూ ఐదుగురు మహిళలు (అందులో చిన్న పాప కూడా ఉందనుకోండి), వారికి నాని లీడర్ అని ప్రచార చిత్రాలు విడుదల చేసి ఆసక్తి ఇంకొంచెం పెంచారు. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా?  
 
కథ: ఆరుగురు కలిసి హైదరాబాద్ పంజాగుట్టలోని ఒక బ్యాంకులో రూ. 300 కోట్లు దొంగతనం చేస్తారు. డబ్బు కాజేసి బ్యాంకు కింద వ్యాన్ దగ్గరకు వచ్చేసరికి ఆరుగురిలో ఒకడు మిగతా ఐదుగురినీ షూట్ చేసి, పోలీసులకు దొరక్కుండా డబ్బుతో చెక్కేస్తాడు. చంపబడిన ఐదుగురిలో ఒకరికి చిన్న పాప చిన్ను (బేబీ ప్రన్యా), ఒకరికి చెల్లి స్వాతి (శ్రియ రెడ్డి), ఇంకొకరు పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి ప్రియ (ప్రియాంక అరుల్ మోహన్), మరొకరికి బామ్మ సరస్వతి (లక్ష్మి), ఇంకొకరికి అమ్మ వరలక్ష్మి (శరణ్య) ఉంటారు. దొంగతనం జరిగిన ఏడాది తర్వాత వీరందరినీ బామ్మ ఏకం చేస్తుంది. ప్రముఖ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్థసారథి (నాని)తో కలిసి తమ వాళ్లను చంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఐదుగురు ఆడవాళ్లకు పెన్సిల్ ఏ విధమైన సహాయం చేశాడు? ప్రముఖ రేసర్, స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ దేవ్ (కార్తికేయ)కు, పెన్సిల్ పార్థసారథికి సంబంధం ఏంటి? అనేది మిగతా కథ. 
 
ప్లస్ పాయింట్స్:
కామెడీ
పాటలు
కథలో మలుపులు
 
మైనస్ పాయింట్స్:
ముఖ్యంగా చివరి అరగంట
నిడివి ఎక్కువైంది
ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్
 
విశ్లేషణ: 
‘మనం’లో క్లిష్టమైన మలుపులను అరటిపండు వలిచి తినిపించినట్టు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాడు దర్శకుడు విక్రమ్ కె. కుమార్. అతడికి ఓ బ్యాంక్ దొంగతనం, అదెవరు చేశారో తెలుసుకోవాలని హాలీవుడ్ సినిమాలను కాపీ కొట్టి పుస్తకాలు రాసే రచయిత చేసే ప్రయత్నాలను వినోదాత్మకంగా చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు. రచయిత ఇంటికి ఐదుగురు ఆడవాళ్లు రావడం, వాళ్ల మధ్య పరిచయం, పగ తీర్చుకోవాలని చేసే ప్రయత్నాలు పెదవులపై చిరు నవ్వు తెప్పిస్తాయి. అప్పటివరకూ సినిమాను బాగా హ్యాండిల్ చేసిన దర్శకుడు… ఒక్కసారి దొంగకు తనను వెంటాడుతున్నది ఎవరో తెలిసిన తర్వాత వచ్చే సన్నివేశాలను, ముఖ్యంగా చివరి అరగంటను సరిగా హ్యాండిల్ చేయలేదు. కథకు కీలకమైన పతాక సన్నివేశాలను రసవత్తరంగా మార్చడంలో ఫెయిల్ అయ్యాడు. ఒక ఫైట్ తో ముగించాడు. పోనీ… కథ లేకున్నా ‘ఇష్క్’లో సన్నివేశాలతో మేజిక్ చేసినట్టు చేశాడా? అంటే అదీ లేదు. దాంతో చివరి అరగంటలో కథలో వేగం, ప్రేక్షకులను కట్టిపడేసే దర్శకత్వం కొరవడ్డాయి. ఎప్పుడు అయిపోతుందా అని ప్రేక్షకుడు ఎదురు చూసేలా క్లైమాక్స్ సాగింది. కార్తికేయ ప్లాష్ బ్యాక్ లో గానీ… లక్ష్మి ఫ్లాష్ బ్యాక్ లో గానీ… భావోద్వేగాలు పండలేదు. సగటు సినిమాల్లో చూసే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లా ఉన్నాయి. 
 
సినిమా ప్రారంభంలో పాత్రలను పరిచయం చేసే సన్నివేశాలను పక్కన పెడితే… పతాక సన్నివేశాల వరకూ సినిమాను విక్రమ్ నడిపించిన తీరు పర్వాలేదు. నాని పరిచయం నుండి పతాక సన్నివేశాల వరకూ కాసేపు వినోదం, మరికాసేపు ఉత్కంఠ కలిగిస్తూ ముందుకు నడిపాడు. నాని ఇన్వెస్టిగేషన్ కొన్నిసార్లు నవ్విస్తే… మరికొన్ని సార్లు ఉత్కంఠ కలిగిస్తుంది. పాటలు కథకు అడ్డు తగల్లేదు. ‘రారా జగతిని జయించుదాం’, ‘హొయన హొయన’ బావున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. కత్తెరకు పని చెప్పాల్సిన సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నాయి. నిడివి ఎక్కువైన ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది.
 
కథకు, పాత్రలకు తగ్గట్టు దర్శకుడు విక్రమ్ కె. కుమార్ నటీనటులను ఎంపిక చేసుకున్నాడు. నానికి ఈ పాత్ర పెద్ద కష్టమేమీ కాదు. అవలీలగా, సహజంగా నటించేశాడు. ప్రతినాయకుడి పాత్రలో ‘ఆర్.ఎక్స్100’ కార్తికేయ మెప్పించాడు. ప్రియాంక అరుల్ మోహన్ పక్కింటి అమ్మాయిలా ఉంది. హీరోయిన్ లా కాదు, పాత్రకు తగ్గట్టు చక్కగా నటించింది. నాని, ప్రియాంక మధ్య కెమిస్ట్రీ బావుంది… ముఖ్యంగా ‘హొయన హొయన’ పాటలో! లక్ష్మి, శరణ్య కూడా చక్కటి నటన కనబరిచారు. ప్రియదర్శి. ‘వెన్నెల’ కిషోర్ కనిపించింది కాసేపే అయినా నవ్వించారు. 
 
finalgaa….
చక్కటి కామెడీ, మంచి పాటలు ‘నానిస్ గ్యాంగ్ లీడర్’లో ఉన్నాయి. కానీ, కథను ప్రారంభం నుండి ముగింపు వరకూ ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తడబడ్డాడు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఒకసారి చూడొచ్చు.