Chitralahari Movie Review Rating : 3/5

Chitralahari Movie Review Rating : 3/5

Chitralahari Movie Review Rating : 3/5

సినిమా రివ్యూ: చిత్రలహరి
రేటింగ్: 3/5

నటీనటులు: సాయి ధరమ్ తేజ్( టైటిల్ కార్డ్స్ లో ‘సాయి తేజ్’గా పేరు మారింది), కళ్యాణి ప్రియదర్శన్, నివేథా పేతురాజ్, పోసాని కృష్ణమురళి, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, జయప్రకాశ్, రావు రమేశ్ తదితరులు
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
పాటలు: చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్, శ్రీమణి
ఎడిటర్: ఎ శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత‌లు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ చెరుకూరి
రచన, ద‌ర్శ‌క‌త్వం: కిశోర్ తిరుమల
విడుదల తేదీ: ఏప్రిల్ 12, 2018

పాపం… సాయిధరమ్ తేజ్ కు వరుసగా ఆరు పరాజయాలు వచ్చాయి. ‘నా పేరు విజయ్. నా పేరులో వున్న విజయం జీవితంలోకి ఎప్పుడు వస్తుందో’ అని ‘చిత్రలహరి’ టీజర్ లో డైలాగ్ చెబితే… రియల్ లైఫ్ క్యారెక్టర్ చేశాడని, సెల్ఫ్ సెటైర్ వేసుకున్నాడని అన్నారంతా! థియేటర్లోకి అడుగుపెట్టిన తర్వాత, ఒక్కో సన్నివేశం ముందుకు వెళుతున్న తర్వాత… ఇది మనకు తెలిసిన కుర్రాడి కథే అనో, ముఖ్యంగా యువతకు మన కథే అనో అనిపిస్తుంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సగటు కుర్రాడి కథతో చేసిన ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కు విజయం అందిస్తుందా? లేదా? కిశోర్ తిరుమల దర్శకత్వం ఎలా ఉంది? తెలుసుకోవడానికి రివ్యూ చదవండి.

కథ: విజయ్ (సాయిధరమ్ తేజ్) బీటెక్ గ్రాడ్యుయేట్. ఇంకా చెప్పాలంటే… మంచి దురదృష్టవంతుడు! ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి విజయం దక్కదు. కార్ యాక్సిడెంట్ అయినప్పుడు, అందులో వ్యక్తి స్పృహలో లేనప్పుడు… అంబులెన్స్, పోలీస్ సర్వీస్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కి సమాచారం ఇచ్చేలా ఒక డివైస్ కనుగొంటాడు. ప్రాజెక్ట్ ఫైల్ పట్టుకుని, స్పాన్సర్షిప్ కోసం పెద్ద పెద్ద కంపెనీల మెట్లు ఎక్కి దిగుతుంటాడు. ప్రతిచోటా అతడికి ఎదురుదెబ్బలు తగులుతుంటాయి. అతడి ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేస్తుంటారు. అదే టైమ్ లో ప్రేమించిన అమ్మాయి లహరి (కళ్యాణి ప్రియదర్శన్) బ్రేకప్ అంటుంది. విజయ్ ని లహరి వద్దనుకోవడానికి ఆమెకు స్నేహితురాలు స్వేచ్ఛ (నివేథా పేతురాజ్) ఇచ్చిన సలహాలే కారణం. అదే స్వేచ్ఛ… ఎందుకు విజయ్ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తుంది? అసలు, విజయ్ కు ఆ డివైస్ తయారు చేయాలనే ఆలోచన రావడానికి కారణమైంది? ఇక, జీవితంలో విజయం సాధించలేనేమో అని నిరాశకు లోనయిన విజయ్ కు అతడి తండ్రి (పోసాని కృష్ణమురళి) ఎలా అండగా నిలబడ్డాడు? చివరకు, విజయ్ జీవితంలోకి విజయం వచ్చిందా? లేదా? అనేది సినిమా

ప్లస్‌ పాయింట్స్‌:
సాయిధరమ్ తేజ్
కిశోర్ తిరుమల సంభాషణలు
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం

మైనస్‌ పాయింట్స్‌:
మరీ నిదానంగా సాగిన కథ
సెకండాఫ్ స్టార్టింగ్

విశ్లేషణ:
కథానాయకుడు తోపు, తురుము, సూరుడు, ధీరుడు అని అతిశయోక్తులు లేవు. ప్రచార చిత్రాల్లో చూపించినట్టు దురదృష్టవంతుడిగా, సాధారణ మధ్యతరగతి యువకుడిలా పరిచయం చేశారు. అక్కడి నుంచి వచ్చే ప్రతి సన్నివేశం పెద్దలకు ఎక్కడో చూసినట్టు, పిల్లలకు ఎక్స్ పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. చివరకు, ప్రేమకథ కూడా! క్యూట్ & లిటిల్ మూమెంట్స్ తో ముందుకు నడిచింది. అయితే… కథలో బలమైన కాంఫ్లిక్ట్ లేదు. కానీ, సాధారణ మధ్యతరగతి యువకుడి జీవితాన్ని ఆవిష్కరించాలని నిజాయతీగా చేసిన ప్రయత్నమిది. పతాక సన్నివేశాల్లో కథానాయకుడు ఏవో అద్భుతాలు సృష్టించినట్టు చూపించకుండా నిజాయతీగా కథను ముందుకు నడిపించిన దర్శకుడు కిశోర్ తిరుమలను, సాయిధరమ్ తేజ్ ను అభినందించాలి. నిర్మాణ విలువలు బావున్నాయి. చాలారోజుల తర్వాత దేవిశ్రీ ప్రసాద్ మంచి ఆల్బమ్ ఇచ్చాడు. ‘ప్రేమ వెన్నెల’, ‘పరుగు పరుగు’ పాటలు బావున్నాయి. ‘గ్లాస్ మేట్స్’ సందర్భానికి తగ్గట్టు ఉంది. నేపథ్య సంగీతం కూడా బావుంది. కార్తీక్ ఘట్టమనేని ఫ్రేమింగ్, లైటింగ్ సినిమాకు మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ‘ప్రేమ వెన్నెల’ పాట పిక్చరైజేషన్, కొరియోగ్రఫీ సూపర్. అయితే… సినిమాలో సమస్య సాగదీత. మరీ నిదానంగా కథ ముందుకు కదిలింది. అలాగే, మరీ కొత్త కథ కూడా కాదు.

కిశోర్ తిరుమల దర్శకుడిగా కంటే సంభాషణల రచయితగా ఎక్కువ ప్రతిభ చూపించాడు. హీరో ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు ‘నీతో ఉండిపోతాను. నీతోనే ఉండి పోతాను’ డైలాగ్ గానీ, ‘చీకటికి చిరునామా’ అంటూ హీరో తన దురదృష్టాన్ని వివరించే డైలాగ్ గానీ, ‘దేవుడు కూడా మోయలేని బరువు, బాధ నా గుండెల్లో ఉంది’ అని హీరో తండ్రి చెప్పే డైలాగ్… ఇలా చాలా సందర్భాల్లో డెప్త్ ఉన్న డైలాగులు రాశాడు. అయితే… సన్నివేశాల్లో ఆ డెప్త్ మిస్ అయ్యింది. ముఖ్యంగా సెకండాఫ్ స్టార్టింగులో కథ ముందుకు కదలదు. ‘వెన్నెల’ కిశోర్ ట్రాక్ విసిగిస్తుంది. ఫస్టాఫ్ లో హీరో ఇంట్రడక్షన్ సన్నివేశాల తర్వాత రొటీన్ అయినప్పటికీ… చక్కటి సిట్యువేషనల్ కామెడీ సీన్స్ రాసిన కిశోర్ తిరుమల, సెకండాఫ్ లో ఆ మేజిక్ రిపీట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు.

నటీనటులు పనితీరు:
సాయిధరమ్ తేజ్ పాత్రకు తగ్గట్టు నటించాడు. గడ్డం పెంచి హెయిర్ స్టయిల్ మార్చడమే కాదు… బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ లాంగ్వేజ్ మార్చాడు. పోసాని నటన తండ్రి పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చింది. కళ్యాణి ప్రియదర్శన్ కొన్ని సన్నివేశాల్లో బావుంది. నివేథా పేతురాజ్ ఓకే. సునీల్ నవ్వించాడు. బ్రహ్మాజీ, రావు రమేశ్, జయప్రకాశ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.

చివరగా:
జీవితంలో ఏదో సాధించాలని కలలు కంటూ… ఏదీ సాధించలేక, విజయం అనే తీరానికి చేరుకోవాలని ప్రారంభించిన ప్రయాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయామని ఆలోచించే సగటు యువతకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది. క్లాస్ పీకే డైలాగులు అక్కడక్కడా తగిలినప్పటికీ… సినిమా నిదానంగా సాగినప్పటికీ… తీసిపారేసే సినిమా కాదు. మంచి ఫీల్ ఇచ్చే సినిమా.