సోలో బ్రతుకే సో బెటర్‌’ థాంక్స్‌ మీట్‌

సోలో బ్రతుకే సో బెటర్‌’ థాంక్స్‌ మీట్‌

‘సోలో బ్రతుకే సో బెటర్‌’ థాంక్స్‌ మీట్‌
 
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బీవీఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మాత‌గా సుబ్బ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెట‌ర్‌’ . నభా నటేశ్ హీరోయిన్. ఈ చిత్రం మ‌రో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియో అసోసియేష‌న్‌తో డిసెంబ‌ర్‌ 25న విడుద‌లైంది. ఈ సందర్భంగా మంగళవారం ఈ సినిమా థాంక్స్‌ మీట్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్‌.నారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా… 
 
డైరెక్టర్‌ సుబ్బు మాట్లాడుతూ – “సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. సాయితేజ్‌గారు ఓ సోదరుడిలా నాకు అండగా నిలబడి ఎంతగానో సపోర్ట్‌ చేశారు. అలాగే నభా నటేశ్‌గారి పెర్ఫామెన్స్‌తో క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు.  ఆర్‌.నారాయణమూర్తిగారి ఇచ్చి ఇంటర్వ్యూని వాడుకున్నాను. ఆయన పెద్ద మనసుతో అంగీకరించారు. అందుకు ఆయనకు థాంక్స్‌. అలాగే నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్‌గారు, బాపినీడుగారు ఇచ్చిన సపోర్ట్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను.  సినిమా ఇంత రిచ్‌గా కనపడటానికి కారణం సినిమాటోగ్రాఫర్‌ వెంకట్‌ సి.దిలీప్‌గారే. అలాగే ఎడిటర్‌ నవీన్‌గారు సినిమాను షార్ప్‌గా చూపించడంలో తనవంతు రోల్‌ పోషించారు. తమన్‌గారు తన సంగీతంతో పాటలనే కాదు.. సన్నివేశాలను కూడా నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్లారు” అన్నారు. 
 
నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ “సినిమా సక్సెస్‌కు దోహదపడ్డ ప్రతి ఒక్కరికీ థాంక్స్‌. ఈ సినిమా రిలీజ్‌ అనేది ఇండియా సినిమా ఇండస్ట్రీకే ఓ మార్గదర్శకంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమాకు ఇండస్ట్రీ మొత్తం చేసిన సపోర్ట్‌కు చూసి అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. మన ఇండస్ట్రీ యూనిటి చూసి ఇతర భాషా సినీ పరిశ్రమలు అభినందిస్తున్నారు. జీ స్టూడియోస్ వారు, యువీ వంశీగారు, దిల్ రాజు గారు సినిమాను రిలీజ్‌ చేయడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు. 
 
నభా నటేశ్‌ మాట్లాడుతూ “ఇండియన్‌ సినిమాకు ప్రేక్షకుడిని తిరిగి తీసుకు రావడంలో కీలకంగా వ్యవహరించిన మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ సినిమాలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రేక్షకులు సినిమా థియేటర్స్‌ను హౌస్‌ఫుల్‌ చేసి మాకెంతో సపోర్ట్‌ చేశారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌గారికి, బాపినీడుగారికి థాంక్స్‌. సాయితేజ్‌కు ధన్యవాదాలు. చాలా స్పోర్టివ్‌గా మాకు సపోర్ట్‌ అందించారు. తమన్‌ మ్యూజిక్‌ను ఎంతగానో ఇష్టపడ్డాను. ఆయన సంగీతాన్ని మేమే కాదు.. అందరూ ఎంజాయ్‌ చేశారు. వెంకట్‌గారు సహా ఎంటైర్‌ టీమ్‌కు ధన్యవాదాలు” అన్నారు. 
 
సాయితేజ్‌ మాట్లాడుతూ – “మేం సినిమా రిలీజ్‌ అనుకున్నప్పటి నుండి.. రెండు పాటలు మిగిలిపోయాయి. అదే సమయంలో కోవిడ్‌ ప్రభావం స్టార్ట్‌ కావడంతో అందరూ అయోమయంగా తయారయ్యాం. అందరూ టీవీలు, ఓటీటీలకు అలవాటు పడిపోతారేమోనని భయపడ్డాం. అదే సమయంలో జీ స్టూడియో నుండి ఓ ఆఫర్‌ వచ్చింది. వాళ్లకి సినిమాను ఇవ్వాలా వద్దా అని అనుకున్నాం. అయితే చివరకు ప్రొడ్యూసర్‌గారికి లాభాలు కావాలనే ఉద్దేశంతో సినిమాను వారికి ఇచ్చేశాం. అయితే థియేటర్స్‌ ఓపెన్‌ అయ్యి.. అప్పటికి సినిమా ఓటీటీలో విడుదల కాలేదంటే సినిమాను థియేటర్స్‌లోనే విడుదల చేద్దామనే అనుకున్నాం. ఓ ఆర్టిస్ట్‌కైనా, నిర్మాతకైనా, దర్శకుడికైనా థియేటర్ ఇచ్చే ఎనర్జీ వేరుగా ఉంటుంది. ఫస్ట్‌ టైమ్‌ డైరెక్టర్‌ తన పేరుని స్క్రీన్‌పై చూసుకుంటే ఉండే ఆనందం అంతా ఇంతా కాదు.. అలాంటి సమయంలో థియేటర్స్‌ను ఓపెన్‌ చేసుకోవచ్చునని రెండు తెలుగు ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చారు. అందుకు ప్రభుత్వాలకు మా టీమ్‌ తరపున ధన్యవాదలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో జీ స్టూడియో వాళ్లు కూడా సినిమాను చూసి దీన్ని థియేటర్స్‌లో విడుదల చేస్తే బావుంటుందని సపోర్ట్‌ చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నాం. సినిమా విడుదల చేసే సమయంలో రకరకాల సమస్యలను ఫేస్‌ చేశాం. అయితే చివరకు సినిమా రిలీజైంది.. సినిమానే గెలిచింది. యువీ వంశీగారు, దిల్‌రాజుగారి హెల్ప్‌తో సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాగలిగాం. అలాగే ఇండస్ట్రీలోని ప్రతి ఒక ఆర్టిస్ట్‌ ఫోన్స్‌ చేసి అభినందించారు. ట్వీట్స్‌ చేశారు. ఇలాంటి ఓ ఇండస్ట్రీలో నేను భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉంది. మా సినిమాకు సపోర్ట్‌ చేసిన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మా యూనిట్‌ తరపున ధన్యవాదాలు చెబుతున్నాం. ప్రేక్షకులు వస్తారో, రారోనని టెన్షన్‌ పడుతూ ఉన్నాను. కానీ.. థియేటర్‌కు ప్రేక్షకులు వచ్చి మా సినిమాను ఆశీర్వదించారు.. అందరికీ థాంక్స్‌” అన్నారు. 
 
ఆర్‌.నారాయణమూర్తి మాట్లాడుతూ “కరోనా సమయంలో మానవజాతి అల్లకల్లోలమైంది. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వలస కార్మికుల్లాగా సినీ కార్మికుల భవిష్యత్తు కూడా ఏంటి? అని అందరూ ఆలోచించుకుంటున్న దశలో.. థియేటర్‌కు మళ్లీ ప్రేక్షకులు వస్తారు. సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వచ్చిన సోలో బ్రతుకే సోబెటర్‌ టీంను అభినందిస్తున్నాను. ముఖ్యంగా కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌గారు థియేటర్స్‌ ఓపెన్‌ చేయడమే కాకుండా రాయితీలు కూడా ప్రకటించారు. ఇది చాలా ఆనందంగా ఉంది. సినిమాలో నా కటౌట్‌ పెట్టి దర్శకుడు సినిమాను నడిపించాడు. అందులో నా అభిమానిగా నటించిన సాయితేజ్‌గారికి థాంక్స్‌. సినిమా చాలా బావుందంటూ అనేక మంది ఫోన్‌ చేస్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటూ గొప్ప మెసేజ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా దర్శకుడు సుబ్బు చూపించారు. ఈ సినిమాలో నాకు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా పాత్ర ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ సినిమాకు వస్తున్న ఆదరణను చూసిన తర్వాత మన తెలుగులోనే కాదు.. ఎంటైర్‌ సినీ ఇండస్ట్రీకి తమ సినిమాను విడుదల చేసుకోగలమనే ధైర్యం వచ్చింది. జనవరి 1న, సంక్రాంతి సందర్భంగా ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ సినిమాలన్నింటికీ సోలో బ్రతుకే సో బెటర్‌ మార్గదర్శిగా నిలిచింది. ఈ సమయంలో నేను ఇచ్చే సలహా ఒకటే ఎవరూ టికెట్‌ ధర పెంచవద్దని నా మనవి. ఎందుకంటే సినిమా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న మాట నిజమే. కానీ.. సినీ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుడు కూడా కరోనా ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నాడు. కాబట్టి ఎంత బడ్జెట్‌ మూవీ అయినా టికెట్‌ రేటు పెంచవద్దని ఇండస్ట్రీని కోరుకుంటున్నాను. కోర్టులకు వెళ్లి టికెట్స్‌ రేట్స్‌ పెంచడం కరెక్ట్‌ కాదు. ఇలా రేట్లు పెంచేస్తే సామాన్య ప్రేక్షకుడు సినిమాను ఏం చూస్తాడు. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టి సినిమా టికెట్‌ రేట్స్‌ పెంచకండి. దీనికి సీఎం కేసీఆర్‌గారు, వైఎస్‌ జగన్‌గారు.. టికెట్‌ రేట్స్‌ పెంచడానికి ఒప్పుకోవద్దని కోరుతున్నాను.