Athiloka Sundari Sridevi Katha Book Launch

Athiloka Sundari Sridevi Katha Book Launch

`అతిలోక సుంద‌రి` పుస్త‌కావిష్క‌ర‌ణ‌

దివంగ‌త న‌టి శ్రీదేవి గురించి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ప‌సుపులేటి రామారావు ర‌చించిన `అతిలోక సుంద‌రి` పుస్త‌కావిష్క‌ర‌ణ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ర‌కుల్ ప్రీత్‌సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలి ప్ర‌తిని ఆవిష్క‌రించి దిల్‌రాజుకు అందించారు. తొలి ప్ర‌తిని మాదాల ర‌వి రూ.20వేలు ఇచ్చి కొనుగోలు చేశారు.

రేలంగి న‌ర‌సింహారావు మాట్లాడుతూ-“సినిమా ఇండ‌స్ట్రీ లో మ‌రుగున‌ప‌డుతున్న ఎంద‌రో మ‌హానుభావుల చ‌రిత్ర‌ను ప‌సుపులేటి రామారావు , వినాయ‌క‌రావు రాయ‌డం చాలా మంచి విష‌యం. బాల‌న‌టిగా ఆమె బ‌లిపీఠంలో రోజార‌మ‌ణి పాత్ర‌లో న‌టించాల్సింది. కానీ అప్పుడు కుద‌ర‌లేదు. ఆ త‌ర్వాత బంగార‌క్క నుంచి ఎన్నో సినిమాల్లో న‌టించారు. మా గురువుగారు ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేట‌ప్పుడు మేం అక్క‌డ ఉండేవాళ్లం. ఆమెకు డెడికేష‌న్ ఎక్కువ‌. ఆమె గురించి ప‌సుపులేటి రాసిన ఈ పుస్త‌కాన్ని పూర్తిగా చ‌దివా. ఆయ‌న‌లోని ర‌చ‌యిత బ‌య‌ట‌కు వ‌చ్చి ఈ పుస్త‌కాన్ని రాశార‌నిపించింది. ప్ర‌తి వాక్యం గొప్ప‌గా రాశారు“ అని అన్నారు.

అచ్చిరెడ్డి మాట్లాడుతూ-“శ్రీదేవికి ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో నేనూ ఒక‌డిని. ఆమెలో ఆత్మ‌సౌంద‌ర్యం ఉంటుంది. నిర్మ‌ల‌త్వం ఉంటుంది. బాల న‌టి నుంచి హాలీవుడ్ న‌టిదాకా ఆమె ప్ర‌స్థానం స్పూర్తిమంతం “ అని చెప్పారు.

భండారు సుబ్బారావు, వై.కె.నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ- “శ్రీదేవి జీవిత చ‌రిత్ర‌తో పుస్త‌కం రావ‌డం ఆనందంగా ఉంది“ అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ -“ఇండియాలో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న న‌టి శ్రీ దేవి. ఆమె గురించి రామారావుగారు పుస్త‌కం రాయ‌డం బావుంది.ఆయ‌న అద్భుత‌మైన జ‌ర్న‌లిస్ట్“ అని అన్నారు.

ర‌కుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ-“అతిలోక సుంద‌రి అనే పేరు ఆమెకే చెల్లింది. ఆమె జీవితం ఓ వేడుక‌. ఇండియాలో తొలి సూప‌ర్ స్టార్ ఆమె. నా ఫేవ‌రేట్ ప‌ర్స‌న్“ అని అన్నారు.

బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ- “రామారావుగారు రాసిన ఈ పుస్త‌కం అంద‌రికీ చేరువ‌వ్వాలి“ అని అన్నారు.

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ- “బంగార‌క్క సినిమాలో ఆమెను చూశాను. ఆ త‌ర్వాత ఆమె ఆకాశ‌మంత ఎత్తు ఎదిగింది. ద‌క్షిణాది నుంచి ఉత్త‌రాదికి వెళ్లిన వైజ‌యంతీమాల‌, రేఖ‌, జ‌య‌ప్ర‌ద‌, శ్రీదేవి చాలా గొప్ప‌వారు. వారిలో ఉన్న అందం, అభిన‌యం, నృత్యం, క్ర‌మ‌శిక్ష‌ణ అన్నీ శ్రీదేవిలో ఉన్నాయి. ఆమె చ‌నిపోయిన‌ప్పుడు ప్ర‌పంచంలోని సినీప్రియులంద‌రూ క‌న్నీరు కార్చారు. తెలిసో తెలియ‌కో కొన్ని త‌ప్ప‌ట‌డుగులు వేస్తాం. వాటి ప‌ర్య‌వ‌సానం వేరుగా ఉంటుంది. ఒక‌సారి నేను సెన్సార్ కోసం ముంబై వెళ్లిన‌ప్పుడు శ్రీదేవిగారిని క‌లిశాను. ఆమె నా సినిమాల గురించి ప్రస్తావించింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు క‌ళాకారుల‌ను ఇబ్బంది పెడుతోంది. ఇబ్బంది పెట్ట‌కూడ‌దు. ఎన్టీఆర్ గురించి అప్ప‌ట్లో సినిమా వ‌స్తోంద‌ని చెబితే ఎన్టీఆర్ ఏం ప‌ర్వాలేద‌న్నారు. అంత స్పోర్టివ్ ప‌ర్స‌న్ ఆయ‌న‌. అలాగే నెహ్రూ గురించి ఆర్‌.కె.నారాయ‌ణ్ వేసిన కార్టూన్ల‌ను నెహ్రూ ఏ రోజూ త‌ప్పుగా తీసుకోలేదు. ఇండ‌స్ట్రీ అంతా క‌లిసి సెన్సార్ గురించి ఆలోచించాలి“ అని అన్నారు.

వైవీయ‌స్ చౌద‌రి మాట్లాడుతూ – “సినిమా హీరోల‌తో పాటు , సినిమా ప‌త్రిక‌లు, అందులో ప‌నిచేసే జ‌ర్న‌లిస్టుల‌ను కూడా సినీ ప్రియులు గుర్తుపెట్టుకునేవారు. అలా నాకు రామారావుగారి పేరు ఇండ‌స్ట్రీలోకి రాక‌మునుపే తెలుసు. ఆయ‌న‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి నిరాడంబ‌ర‌మైన జీవితాన్ని గ‌డుపుతుంటారు. అవ‌గాహ‌నతో అర్థ‌వంత‌మైన ర‌చ‌న‌లు చేస్తుంటారు. వారి ఆలోచ‌నా విధానం గొప్ప‌గా ఉంటుంది. శ్రీదేవి గురించి రామారావుగారు రాయ‌డం బావుంది. `బూచాడ‌మ్మా బూచాడు` స‌మ‌యంలోనే ఆమె ప‌ట్ల నాకు తెలియ‌ని ఆక‌ర్ష‌ణ క‌లిగింది. 16 ఏళ్ల వ‌య‌సులో ఆమె ప‌ట్ల ఆక‌ర్ష‌ణ పెరిగింది. ఆ త‌ర్వాత ఆమె వ్య‌క్తిత్వం గురించి అవ‌గాహ‌న చేసుకున్నా. చెన్నైలో ఆమె ఫియ‌ట్ 9097 కారులో వెళ్తుంటే ఫ్యాన్‌గా ఆ మెను సైకిల్ మీద అనుస‌రించేవాడిని. ఆ త‌ర్వాత టీఎంఐ 2266 మెట‌ల్ సిల్వ‌ర్ కారులో వెళ్తున్న‌ప్పుడూ అంతే. ఆ త‌ర్వాత ఆమె మా గురువుగారి సినిమాల్లో న‌టించేట‌ప్పుడే ద‌గ్గ‌రి నుంచి చూశాను. అందం, అభిన‌యం, అణ‌కువ‌, స‌క్సెస్ ప‌రంప‌ర ఉన్న‌ప్పటికీ అహంకార‌పు చాయ‌లు లేని న‌టి శ్రీదేవి. చాలా రాజ‌సంగా, హుందాగా బిహేవ్ చేసేవారు. ఒక‌సారి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో క‌నిపించిన‌ప్పుడు ఎన్నో జాగ్ర‌త్త‌లు చెప్పాను. ఆమెకు ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు. దీర్ఘాయుష్షు కూడా ఇస్తే బావుండేది. మ‌ళ్లీ ఆమెను దేవుడు పుట్టించాలి“ అని అన్నారు.

మాదాల ర‌వి మాట్లాడుతూ “జ‌ర్న‌లిస్ట్ ఐకాన్ పసుపులేటి రామారావుగారు. వామ‌ప‌క్ష భావాలున్నవ్య‌క్తి. అప్ప‌టి నుంచి ఇప్ప‌టిదాకా ఆయ‌న రాజీలేని పోరాటం చేస్తూనే ఉన్నారు. జ‌ర్న‌లిజంకి మంచి పేరు తెచ్చారు. మా నాన్న‌గారికి ఆయ‌నే పీఆర్వో. ఏరోజూ డ‌బ్బు తీసుకునేవారు కాదు. మేమే బ‌తిమ‌లాడి జేబులో పెట్టేవాళ్లం. ఉన్న‌త విలువ‌లున్న వ్య‌క్తి ఆయ‌న‌. భావిత‌రాల‌కు ఆయ‌న పుస్త‌కాలు మార్గ‌నిర్దేశ‌కాలు. చ‌నిపోయిన వారు అంద‌రి హృద‌యాల్లోకి వెళ్తే వాళ్లు స్వ‌ర్గంలోకి వెళ్లిన‌ట్టు. లేకుంటే న‌ర‌కానికి వెళ్లిన‌ట్టు. శ్రీదేవిగారు స్వ‌ర్గంలోనే ఉన్నారు“ అని అన్నారు.

శివాజీరాజా మాట్లాడుతూ – “ప‌సుపులేటి రామారావుగారు, ఆర్. నారాయ‌ణ‌మూర్తిగారిని చూస్తే చాలా సింపుల్ గా ఉంటారు. వాళ్ల‌లాగా నేను ఉండ‌ల‌నా అని ఆలోచిస్తాను. నాకు శ్రీదేవిగారంటే ఇష్టం. చిరంజీవిగారు న‌టించిన సినిమాల్లోను ఆయ‌న డ్యాన్సుల‌నే చూశాను. కానీ ఒక్క సినిమాలో మాత్రం ఆయ‌న ప‌క్క‌న డ్యాన్స్ చేశాను. శ్రీ దేవిగారిని చూశాను. ఆమె న‌వ‌ర‌సాల తేనుప‌ట్టు, ద‌క్షిణాది నుంచి వెళ్లి ఇండియాలో స్టార్ కావ‌డం అంటే మాట‌లు కాదు. శ్రీదేవి మ‌ళ్లీ పుడుతుంది. ఇదే ప‌రిశ్ర‌మ‌లో ఉంటుంది. 100 ఏళ్లు బ‌తుకుతుంది “అని అన్నారు.

ప‌సుపులేటి రామారావు మాట్లాడుతూ -“శ్రీదేవి నాకు బాల‌న‌టిగా ప‌రిచ‌యం. ఆ పాప గురించి జ్యోతిచిత్ర‌లో రాయ‌మ‌ని వాళ్ల అమ్మ న‌న్ను ఎన్నోసార్లు అడిగేవారు. ఒక‌సారి మాదాల రంగారావుగారు ఓ సినిమా వార్త ఇవ్వ‌మ‌ని చెప్పారు. నేను ఇచ్చాను. అందులో ద‌ర్శ‌కుడి పేరు లేదు. ఆ ద‌ర్శకుడి సెట్లోనే నేను శ్రీదేవి ఇంట‌ర్వ్యూ చేయాల్సి వ‌చ్చింది. అప్పుడు ఆ ద‌ర్శ‌కుడు న‌న్ను బ‌య‌టికి పోమ్మ‌న్నాడు. కానీ ఆమె మాత్రం బ‌య‌ట‌కు వ‌చ్చి నన్ను పిలిచి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ మ‌ధ్య ఒక‌సారి ఆమె పార్క్ హ‌య‌త్ హోట‌ల్ లో ఉందని తెలిసి వెళ్లాం. నేను సంతోషం సురేష్ కొండేటి , ఫోటోగ్రాఫ‌ర్ వాసుతో క‌లిసి వెళ్లాం. ఆమె మా కోసం కింద‌కి దిగి వ‌చ్చి , ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఆమెఎక్క‌డున్నా ఆమెను మ‌ర్చిపోలేం“ అని అన్నారు

సురేష్ కొండేటి మాట్లాడుతూ -“నేను ప‌త్రికాధినేత‌గా ఎన్నో క‌వ‌ర్ పేజీలు చూశాను. కానీ నాకుఅతిలోక‌సుంద‌రి క‌వ‌ర్ పేజీ బాగా నచ్చింది. వండ‌ర్ ఫుల్ క‌వ‌ర్ పేజీ ఇది“అని అన్నారు.

ఏడిద శ్రీరామ్ మాట్లాడుతూ -“రామారావుగారు మొద‌టి నుంచీ అదే సింప్లిసిటీ మెయింటెయిన్ చేస్తున్నారు. అప్ప‌ట్లో ఆయ‌న సినిమా డైరెక్ట‌రీ వేసేవారు. దాని కోసం చాలా మంది ఎదురుచూసేవారు. మా నాన్న కూడా ఒక‌సారి యాడ్ ఇచ్చారు. కానీ మ‌నీ ఇవ్వ‌డం మ‌ర్చిపోయారు.ఆ త‌ర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చి మేం ఇస్తేగాని తీసుకోలేదు“ అని అన్నారు.