Thippara Meesam Review

Thippara Meesam Review
 
తిప్పరా మీసం సినిమా రివ్యూ: 
రేటింగ్: 2/5
 
 నటీనటులు: శ్రీవిష్ణు, రోహిణి, నిక్కీ తంబోలి, బెనర్జీ, అచ్యుత రామారావు, నవీన్ నేని తదితరులు
పాటలు:పూర్ణాచారి, అల రాజా
సినిమాటోగ్రఫీ: సిద్ 
సంగీతం: సురేష్ బొబ్బిలి
నిర్మాణ సంస్థలు: రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా
నిర్మాత: రిజ్వాన్
దర్శకత్వం:కృష్ణవిజయ్ ఎల్
విడుదల తేదీ: 08 నవంబర్ 2019
 
‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘మెంటల్ మదిలో’, ‘నీదీ నాదీ ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’తో శ్రీవిష్ణు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. మరి, ‘తిప్పరా మీసం’ ఎలా ఉంది? టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన ఈ సినిమా, అందుకు తగ్గట్టు ఉందా? రివ్యూ చదివి తెలుసుకోండి.
 
కథ: మణిశంకర్ అలియాస్ డీజే మణి (శ్రీవిష్ణు) చిన్నతనంలో తండ్రి మరణిస్తాడు. దాంతో అతణ్ణి తల్లి (రోహిణి) గారాబంగా పెంచుతుంది. పాఠశాలకు వెళ్లే వయసులో మత్తు మందులు, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్)కి అలవాటు పడతాడు. ఇది తెలిసిన తల్లి, అతడికి దూయారంగా ఉండటం కష్టమైనా… పిల్లాడి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రీహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ చేయిస్తుంది. తనను ఒంటరిగా వదిలేసిందనే కారణంతో తల్లిపై కోపం పెంచుకుంటాడు మణి. తల్లి దూరంగా ఉంటూ పబ్ లో డీజేగా పని చేస్తుంటాడు. క్రికెట్ బెట్టింగ్ కాయడం అతడి ఉన్న మరో దురలవాటు. క్రికెట్ బెట్టింగ్ వల్ల బుకీకి 30 లక్షలు బాకీ పడతాడు. ఆ అప్పు తీర్చడానికి డబ్బులు ఇవ్వమని తల్లితో గొడవ పడతాడు. ఏనాటికైనా కొడుకు తన ప్రేమను అర్థం చేసుకుంటాడని, అతడు ఎంత బాధ పెట్టినా ఓర్పు, సహనంతో తల్లి భరిస్తుంది. అతడు ఏమో కాళీ అనే ఎమ్మెల్యే అనుచరుణ్ణి హత్య చేసి జైలుకు వెళతాడు. కాళీని మణి ఎందుకు హత్య చేశాడు? చివరకు, అతడు తల్లి ప్రేమను అర్థం చేసుకున్నాడా? లేదా? అనేది మిగతా సినిమా.
 
ప్లస్ పాయింట్స్:
శ్రీవిష్ణు, క్లైమాక్స్
సురేష్ బొబ్బిలి సంగీతం
సిద్ సినిమాటోగ్రఫీ
‘రాధా రమణం’ సాంగ్
 
మైనస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం
కథలో బలమైన కాంఫ్లిక్ట్ లేదు
ఆకట్టుకొని సన్నివేశాలు 
నిడివి ఎక్కువైంది
‘అర్జున్ రెడ్డి’ని గుర్తుచేసే హీరో క్యారెక్టరైజేషన్
 
విశ్లేషణ: 
‘అర్జున్ రెడ్డి’ విజయానికి హీరో గడ్డం పెంచుకుని కనిపించడం, ఎప్పుడూ కోపంగా ఉండటం, మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తిగా కనిపించడం మాత్రమే కారణాలు కాదు. హీరో కోపం వెనుక ఓ కథ ఉంటుంది. మాదక ద్రవ్యాలకు బానిస కావడం వెనుక ఓ గతం ఉంటుంది. యాంగర్ మేనేజ్‌మెంట్‌లో అర్జున్ రెడ్డి జీరో అని ముందునుండి ప్రేక్షకులను దర్శకుడు ప్రిపేర్ చేస్తూ వస్తాడు. అతడి బ్రేకప్ వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది. అన్నిటికీ మించి ప్రతి సన్నివేశంలో ఒక ఫీల్ ఉంటుంది. ‘తిప్పరా మీసం’ విశ్లేషణలో ‘అర్జున్ రెడ్డి’ ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే… శ్రీవిష్ణు క్యారెక్టరైజేషన్, ‘అర్జున్ రెడ్డి’లో హీరో క్యారెక్టరైజేషన్ ను గుర్తు చేస్తుంది. సినిమాలో హీరో మణి డ్రగ్స్ కు బానిస అవుతాడు. తనను ఒంటరిగా వదిలేసిందని తల్లిపై చెప్పలేనంత కోపం పెంచుకుంటాడు. స్నేహితులు, శ్రేయోభిలాషులు, చివరకు ప్రేమించిన అమ్మాయి చెప్పేది కూడా వినడు. మొదటి నుండి అంతే. కానీ, ఎక్కడా అతడి కోపానికి గల కారణాలు ప్రేక్షకులకు సహేతుకంగా అనిపించవు. 
 
రీహాబిలిటేషన్ సెంటర్ లో తనను ఒంటరిగా వదిలేసిందని తల్లిపై కోపం పెంచుకున్నవాడు… ఆట చెడ్డదా? మంచిదా? అనేది పక్కన పెడితే, ఆటలో న్యాయంగా గెలిచిన డబ్బును ఎవడో కొట్టేసి తీసుకువెళితే వాడిపై ఎంత కోపం పెంచుకోవాలి? అటువంటి వాడిని మరిచిపోవడం ఏంటి? ‘అర్జున్ రెడ్డి’కి, ‘తిప్పరా మీసం’లో హీరో క్యారెక్టర్ కు తేడా ఇదే! ‘అర్జున్ రెడ్డి’లో హీరో రోడ్డున పడిన సందర్భంలో బిచ్చగాడి సహాయం తీసుకుంటాడు గానీ, ఇంటికి వెళ్లి గొడవ చేయడు. అసలు ఇవన్నీ పక్కనపెడితే… సినిమా ప్రారంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకూ, తను ఒంటరిగా వదిలేసిందని తల్లిపై హీరో కోప్పడ్డం తప్ప మరో బలమైన కారణం ఏదీ కనిపించదు. తల్లి ప్రేమను అర్థం చేసుకొని మూర్ఖుడిలా కనిపిస్తాను. తలా తోకా లేని సన్నివేశాలు ఏవో వచ్చి వెళుతూ ఉంటాయి. ఏవో ఆటలు పెట్టారు. మధ్యలో ప్రేమ కథ ఒకటి!  హీరో ప్రేమలో పడే సన్నివేశాలు గానీ, అసలు ప్రారంభం నుంచి వచ్చే సన్నివేశాలు గానీ ఏవి ఆకట్టుకోవు. అయితే… నేపథ్య సంగీతంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోసే ప్రయత్నం చేశాడు సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి. ప్రేమకథలో వచ్చే ‘రాధా రమణం’ పాట, సాహిత్యం బాగున్నాయి. నైట్ ఎఫెక్ట్ సీన్స్, పబ్ లో వచ్చే సన్నివేశాల్లో సినిమాటోగ్రాఫర్ సిద్ చక్కగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు పరవాలేదు. షర్మిల కళా దర్శకత్వం బాగుంది. హీరో ఇల్లు, పబ్ డిజైన్ బావుంది. హీరోలో పరివర్తన వచ్చే సన్నివేశాలు రొటీన్ అయినప్పటికీ బాగున్నాయి. కానీ, అప్పటికే ప్రేక్షకుడు విసుగు చెంది ఉండడంతో అంతగా ఫీల్ కాలేడు. కథను ఆసక్తికరంగా చెప్పడంలో దర్శకుడు కృష్ణ విజయ్ ఫెయిల్ అయ్యాడు.
 
నటీనటులు:  
శ్రీవిష్ణు పాత్రకు తగ్గట్టు గడ్డం, మీసం పెంచాడు. రగ్గడ్ లుక్ లో బావున్నాడు. పాత్రకు తగ్గట్టు బాగా నటించాడు కూడా! ప్రారంభం నుండి సన్నివేశాల్లో బావున్నట్టయితే… పతాక సన్నివేశాల్లో అతడి నటన ప్రేక్షకులను కంటతడి పెట్టించేది. దర్శకత్వంలో లోపాల కారణంగా శ్రీ విష్ణు వృధా అయింది. తల్లిగా రోహిణి పాత్ర పరిధి మేరకు నటించారు. సినిమాలో ప్రేమకథ వీక్ గా ఉంది. ప్రేమకథలో ప్రేయసిగా నటించిన నిక్కీ తంబొలి నటన కూడా చాలా వీక్. మిగతా నటీనటుల్లో చాలామంది ఓవర్ చేశారు.
 
ఫైనల్ గా .
ప్రేక్షకులు ప్రచార చిత్రాలు చూసి సినిమాకు వెళితే మోసపోవడం గ్యారెంటీ. శ్రీ విష్ణు, రోహిణి అద్భుతంగా నటించినా…. కథ, దర్శకత్వంలో లోపం కారణంగా ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా నిస్సారంగా సాగుతుంది. సన్నివేశాలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. కథ ఎంతసేపటికీ ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతుంది. మీసం మెలేసే సన్నివేశాలు ఎంతకూ రావు. సినిమాలో సరైన సన్నివేశాలు చివరి వరకు రాలేదు. దీంతో మీసం సరిగా తిప్పలేకపోయారు అని చెప్పాలి .