Raja Vaaru Rani Gaaru Review

Raja Vaaru Rani Gaaru Review
 
మూవీ  రివ్యూ: రాజావారు రాణిగారు
 రేటింగ్: 2.25/5

నటీనటులు: కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం, కిట్టయ్య తదితరులు
పాటలు: భరద్వాజ పుత్రుడు, రాకేందుమౌళి  
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత, అమర్ దీప్ గుట్టల  
సంగీతం: జయ్ క్రిష్
నిర్మాతలు: మనోవికాస్ డి, మీడియా9 మనోజ్
దర్శకత్వం: రవికిరణ్ కోలా
విడుదల తేదీ: 29 నవంబర్ 2019

పాతికేళ్ళు నిండని ఓ కుర్రాడు దర్శకత్వం వహించిన సినిమా ‘రాజావారు రాణిగారు’. దర్శకుడిగా రవికిరణ్ కోలాకు ఇదే తొలి సినిమా. హీరో హీరోయిన్లు, నిర్మాతలు, సినిమాలో కమెడియన్లు… ఆల్మోస్ట్ అందరికీ తొలి చిత్రమే. కొత్తవాళ్లు అందరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉంది? ప్రచార చిత్రాలతో ఆకట్టుకున్న ఈ బృందం, సినిమాతో ఆకట్టుకుంటుందా? రివ్యూ చదవండి.

కథ: అనగనగనగా గోదావరి జిల్లాలో శ్రీరామపురం అని ఓ గ్రామం. అందులో రాజా (కిరణ్ అబ్బవరం) అని ఓ కుర్రాడు. రాణి (రహస్య గోరఖ్)ను ప్రేమిస్తాడు. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి భయపడుతుంటాడు. ప్రపోజ్ చేయాలని చాలాసార్లు ప్రయత్నిస్తాడు. చేయలేక వెనక్కి వచ్చేస్తాడు. ఈలోపు ఇంటర్ పూర్తి అవుతుంది. ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ చదువుకోవడానికి అమ్మమ్మగారి ఊరు వెళుతుంది రాణి. ఈ ఊరు ఏదో తెలుసుకోవడానికి రాజా ఎంత ప్రయత్నించినా కుదరదు. రాజా బాధ చూడలేక అతడి స్నేహితులు నాయుడు (యజుర్వేద్ గుర్రం), చౌదరి (రాజ్ కుమార్ కసిరెడ్డి) ఏం చేశారు? రాణిని ఊరు రప్పించడానికి ఏం ప్లాన్ వేశారు? ఊరు వచ్చిన రాణికి రాజా ఐలవ్యూ చెప్పాడా? లేదా? చివరకు ఏం జరిగింది? అనేది మిగతా సినిమా.

ప్లస్ పాయింట్స్:
సంగీతం, సాహిత్యం
ఛాయాగ్రహణం
దర్శకత్వం
వినోదం
నూతన నటీనటుల అభినయం

మైనస్ పాయింట్స్:
‘తొలిప్రేమ’ను గుర్తుచేసే మెయిన్ పాయింట్
సన్నివేశాల్లో సాగదీత
సింపుల్ స్టోరీ
సెకండాఫ్

విశ్లేషణ:
ఫేస్‌బుక్‌లో పలకరించుకుని, వాట్సాప్‌లో ప్రేమించుకుంటూ, మల్టీప్లెక్స్‌ల చుట్టూ షికార్లు చేస్తున్న ఈతరం ప్రేమకథలకు దూరంగా, పల్లెటూరి వాతావరణానికి దగ్గరగా ఉంటుందీ సినిమా. ఇప్పుడు పల్లెల్లో కూడా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్‌నెట్ వచ్చేశాయనుకున్నాడో? ఏమో? దర్శకుడు కాలంలో కొంచెం, ఓ పదేళ్లు వెనక్కి వెళ్లాడు. అందువల్ల, ఇప్పటి టీనేజర్లకు ఈ సినిమా కొత్తగా ఉంటే… పాతికేళ్ళు దాటినవారికి, ముఖ్యంగా పల్లెటూరి ప్రజలకు అప్పటి రోజులను గుర్తు చేస్తుంది.

చెప్పుకోవాలంటే ‘రాజావారు రాణిగారు’లో గొప్ప విషయం ఏమీ లేదు. కానీ, కథలో పాత్రలను దర్శకుడు మలిచిన తీరు గొప్పగా ఉంది. గొప్ప అనడం కంటే అత్యంత సహజంగా ఉందని చెప్పడం సబబుగా ఉంటుంది. ఆ సహజత్వమే సినిమాకు గొప్ప కళను తీసుకొచ్చింది. క్లుప్తంగా కథను చెప్పాలంటే… ఓ అమ్మాయికి ప్రేమ విషయం చెప్పలేక సతమతమయ్యే అబ్బాయి కథ. ‘తొలిప్రేమ’లో తనతో స్నేహం చేసే కీర్తి రెడ్డికి ప్రేమ విషయం చెప్పలేక పవన్ కల్యాణ్ చాలా సతమతం అవుతారు. విశ్రాంతి తర్వాత ‘రాజావారు రాణిగారు’లో వచ్చే కొన్ని సన్నివేశాలు, కథాంశం ‘తొలిప్రేమ’ను గుర్తు చేస్తుంది. సినిమా మరీ నిదానంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ… దర్శకుడు కొంత వరకూ మాటలతో, వినోదంతో కొత్తగా తీసే ప్రయత్నం చేశాడు.

‘పెళ్లి చేసుకుని చదువుకోమని వాడు అంటున్నాడు. నన్ను ప్రేమిస్తూ చదువుకోమని నేను చెప్పనా?’ వంటి లోతైన భావం కల మాటలు రాశాడు రవికిరణ్ కోలా. ప్రేమ డైలాగులే కాదు… ‘నమస్కారాలు మాకు. ఓట్లు వాళ్లకు’ అంటూ కరెంట్ టాపిక్స్ మీద సెటైర్స్ వేశాడు. నాయుడు, చౌదరి కలిసి చేసే పనులకు ప్రేక్షకులు నవ్వుకోవడం గారంటీ. ఆ సన్నివేశాలను అంత బాగా రాశాడు. సన్నివేశాల్లో సహజత్వం, పల్లె వాతావరణంతో సినిమా అందంగా ఉంటుంది. సినిమా ఇంత అందంగా ఉండటానికి ముఖ్య కారణం… సంగీత దర్శకుడు జయ్ క్రిష్, సినిమాటోగ్రాపర్స్ విద్యాసాగర్, అమర్ దీప్. పల్లెటూరి నేపథ్యంలో సినిమా అని మరీ ఓల్డ్ క్లాసికల్ మ్యూజిక్ ఇవ్వలేదు. ర్యాప్, పాప్ మ్యూజిక్ గుర్తుచేసే గీతాలను జయ్ క్రిష్ అందించాడు. ప్రతి సన్నివేశంలో పల్లె వాతావరణాన్ని అందంగా చూపించిన విద్యాసాగర్, అమర్ దీప్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు ఆకట్టుకుంటాయి.  

నటీనటులు:  
హీరో హీరోయిన్లు కిరణ్, రహస్య పాత్రలకు తగ్గట్టు చక్కగా నటించారు. కొత్తవారు కావడంతో నటీనటుల ఇమేజ్ కాకుండా పాత్రలు మాత్రమే కనిపించాయి. హీరో స్నేహితులుగా నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి, యజుర్వేద్ గుర్రం బాగా చేశారు. ఇద్దరి కామెడీ టైమింగ్ బాగుంది. ఇద్దరిలో చౌదరిగా నటించిన రాజ్ కుమార్ కొన్ని ఎక్కువ మార్కులు కొడతాడు. చౌదరి తండ్రి పాత్రలో కిట్టయ్య కనిపించేది రెండు మూడు సన్నివేశాల్లోనే అయినప్పటికీ… నవ్విస్తాడు. మిగతా పాత్రల్లో ఎవరి పాత్ర పరిధి మేరకు వారు నటించారు.
 ఫైనల్ తీర్పు :
‘రాజావారు రాణివారు’ కథ కొత్తది, గొప్పది అని చెప్పడం లేదు. కానీ, ఇటీవల వస్తున్న సినిమాల మధ్య కొత్తగా ఉంటుందని పక్కాగా చెప్పవచ్చు. నవ్వులకు లోటు లేదని ఘంటాపథంగా చెప్పవచ్చు. కథలో, సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ వాటిని క్షమించవచ్చు. చక్కటి సాహిత్యం, సంగీతం, వినోదం,  ఛాయాగ్రహణం ఉన్న చిత్రమిది. స్వచ్ఛమైన సంగీతభరిత వినోదాత్మక చిత్రమిది.  ఒకసారి చూడవచ్చు.